జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

కల్నల్‌, మేజర్‌ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది వీరమరణం
ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రక్తపాతం సృష్టించారు. భద్రతా బలగాలపై విరుచుకుపడ్డారు. ఉత్తర కశ్మీర్‌ హంద్వారా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ కల్నల్‌, ఓ మేజర్‌ సహా ఐదుగురు భద్ర తా సిబ్బంది వీరమరణం పొందినట్లు డిజిపి దిల్‌బాఘ్‌ సింగ్‌ వెల్లడించారు. కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్‌, జెకెపి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ షకీల్‌ ఖాజిలు సహా ఐదుగురు సాహస సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని తెలియజేసేందుకు విచారంగా ఉం దని దిల్‌బాఘ్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న సామాన్య పౌరులను కల్నల్‌, అతని బృందం ఎంతో ధైర్యసాహాసాలు ప్రదర్శించి రక్షించిననట్లు ఆయన చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. కాగా, కుప్వారా జిల్లా హంద్వారాలోని చంగిముల్లాలో ఓ ఇంట్లో ముష్కరులు కొంతమంది సామన్య పౌరులను బందీలుగా చేసుకున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని ఆర్మీ పేర్కొంది. దీంతో ఆర్మీ, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తగా ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించింది. ఐదుగురితో కూడిన బృందం, పోలీసు సిబ్బంది సామాన్య పౌరులను రక్షించేందుకు ఉగ్రవాదులు ఆక్రమించిన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ ప్రాంతంలోకి ప్రవేశించి విజయవంతంగా పౌరులను రక్షించినట్లు ఆర్మీ పేర్కొంది. అయితే ఈ ప్రక్రియలో ఆర్మీ, పోలీసులపై ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులకు తెగపడ్డారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా, ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఓ పోలీసు వీర మరణం పొందినట్లు ఆర్మీ ప్రకటించింది. ఉగ్రవాదులు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి హందారాకు వచ్చినట్లు తాము భావిస్తున్నామని అధికారులు చెప్పారు. కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్‌, ఇతర ఆర్మీ సిబ్బంది మృతి చెందగా వారిని నాయక్‌ రాజేష్‌, లాన్స్‌ నాయక్‌ దినేష్‌గా గుర్తించారు. కల్నల శర్మ 21 రాష్ట్రీయ రైఫిల్స్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?