జన్‌ధన్‌ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం కోసం ల్యాబ్‌ల ఏర్పాటు
ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు ప్రోత్సాహకాలు
త్వరలోనే టీవీ, రేడియోల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు
దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలకు రూ. 15 వేల కోట్లు
గ్రామీణ ఉపాధి హామీ పనులకు మరో రూ. 40 వేల కోట్లు
ఆఖరి దశ ప్యాకేజీని వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజృంభణ కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దీన్ని చక్కదిద్దేందుకు ఉద్దీపన ప్యాకేజీలంటూ రోజుకో పత్రం విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని లెక్కలను విడుదల చేసింది. ఇవి కూడా గత బడ్జెట్‌లో దాదాపుగా పేర్కొన్నవే. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా మూడు దశల వివరాలను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారంనాడు నాల్గవది, ఆఖరిదైన ప్యాకేజీని ప్రకటించారు. 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం కోసం ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తామని, జిల్లా స్థాయిలో ప్రతి ఆస్పత్రిలో డిస్‌ఇన్పెక్షన్‌ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడంలో భాగంగా వన్‌ క్లాస్‌-వన్‌ డిజిటిల్‌ పేరుతో డిజిటల్‌ పాఠాలకు శ్రీకారం చుడతామన్నారు. త్వరలోనే టీవీ, రేడియోల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. గ్రామీణ ఉపాధి హామీ పనులకు అదనంగా మరో రూ. 40 వేల కోట్లు కేటాయించామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రాష్ట్రాలకు రుణ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు ఆమె తెలిపారు. రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతం పెంచుకునేందుకు ఎలాంటి షరతులు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో 3.5 నుంచి 5 శాతం వరకు రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కల్పించారు. రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. కోవిడ్‌19 దృష్ట్యా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేందకు అన్నివిధాలా చర్యలు తీసకుంటున్నామని చెప్పారు. రూ. 11,092 కోట్ల ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జీతభత్యాల చెల్లింపులో రాష్ట్రాలకు ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసకునే అవకాశం కల్పించడంతో పాటుగా.. ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసుకునే అవకాశాన్ని 52 రోజులకు పెంచినట్టు వెల్లడించారు. పన్ను ఆదాయం కింద రాష్ట్రాలకు రూ. 46 వేల కోట్ల కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే చాలా రంగాల్లో సంస్కరణలకు సంబంధించి ప్రకటనలు చేశామని నిర్మల గుర్తుచేశారు. ప్రాణం ఉంటేనే.. ప్రపంచం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. పేదలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలలకు సరిపడా రేషన్‌ సరఫరా చేశామని చెప్పారు. పీఎం కిసాన్‌ పథకం ద్వారా 8.19 కోట్ల మందికి రూ. 2వేల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. జన్‌ధన్‌ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేశామన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే 2.20 కోట్ల మంది కూలీలకు ఆర్థిక సహాయం అందించామని.. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ. 3,995 కోట్లు జమచేశామని చెప్పారు. ఉజ్వల యోజన ద్వారా 6.81 కోట్ల ఫ్రీ సిలిండర్లు సరఫరా చేశామని మంత్రి గుర్తుచేశారు. 12 లక్షల మంది ఈపీఎఫ్‌ ఖతాదారులు ఒకేసారి నగదు విత్‌ డ్రా చేసుకున్నారని వెల్లడించారు. దేశంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటికే 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు సరఫరా చేశామన్నారు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బంది రూ. 50 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద రాష్ట్రాలకు రూ. 4,113 కోట్లు అందజేశామని తెలిపారు. రాష్ట్రాలను ఆదుకునేందుకు నిరంతరం అదనపు నిధులు విడుదల చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రాలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు పన్నుల్లో వాటా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రాల విపత్తు నిర్వహణ కోసం నిధులు విడుదల చేస్తూనే ఉన్నామని, ఏప్రిల్‌ నుంచి రాష్ట్రాలకు రూ.46,038 కోట్లు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.12,390 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.11,092 కోట్లు విడుదల చేశామన్నారు. నిధుల కొరత ఉన్న రాష్ట్రాలకు ఆర్‌బిఐ ద్వారా నిధులు సమకూర్చాం, కేంద్రం విజ్ఞప్తిని మన్నించి రాష్ట్రాలకు ఆర్‌బిఐ ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం పెంచిందని తెలిపారు. ఒక త్రైమాసికంలో రాష్ట్రాల ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితి 32 రోజుల నుంచి 50 రోజులకు పెంచినట్లు వివరించారు. రాష్ట్రాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ పరిమితిని ఆర్‌బిఐ 60శాతం పెంచిందన్నారు. రాష్ట్రాలకు అందుబాటులోకి తెచ్చిన రుణాల్లో కేవలం 14 శాతం మాత్రమే వినియోగించుకున్నాయి, రాష్ట్రాలు వినియోగించుకుంది పోనూ రూ.4.28లక్షల కోట్లు రుణాల రూపంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రాల రుణపరిమితిని జిఎస్‌డిపిలో 3 నుంచి 5 శాతానికి పెంచామని, రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ.4.28లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?