జనతా కర్ఫ్యూ

22న ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పాటిద్దాం
ప్రపంచయుద్ధాలకన్నా కరోనా పెద్ద విపత్తు
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో నరేంద్రమోడీ

న్యూఢిల్లీ: ప్రస్తుతం మనల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తు అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. కరోనాపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో నరేంద్రమోడీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని, ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జనం కోసం జనం ద్వారా జనమే విధించుకునే కర్ఫ్యూగా మోడీ అభివర్ణించారు. “జనతా కర్ఫ్యూ కోసం మీ మద్ధతును కోరుతున్నాను. ఈ కర్ఫ్యూ మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. స్వచ్ఛంద కర్ఫ్యూ వల్ల కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెరగడమే కాకుండా, ఆ రోజంతా వైరస్‌ను దరిచేరనీయకుండా మనందరం విజయం సాధించినట్లే అవుతుంది. స్వయం నియంత్రణకు ఇదొక సంకేతం అవుతుంది” అని మోడీ అన్నారు. ప్రపంచ మానవాళి మొత్తం కరోనా సంక్షోభం ఎదుర్కొంటోందని, రెండు నెలలుగా ఇది కొనసాగుతోందని చెప్పారు. ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తును మనం ఎదుర్కొంటున్నామన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగరూకతతో వ్యవహరించడం అవసరమని, అందరం చేయి చేయి కలిపి మహమ్మారిపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, వీలైనంత వరకు వ్యాపారాలు, ఉద్యోగాలు ఇంట్లోంచే చేయాలన్నారు. వైద్యరంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుందని, అలాంటి తప్పనిసరి విభాగాల్లో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 60- ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వవద్దని మోడీ కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మహమ్మారి సృష్టిస్తున్న విలయం కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నదని, ప్రపంచ దేశాలు దీన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని, ఇప్పుడే ఊరట లభించేలా కనిపించడం లేదన్నారు. వచ్చే కొద్ది వారాలు మీ అందరి సమయం ఇవ్వాలని మోడీ కోరారు. “ఇందుకు మన ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి దృఢ సంకల్పం. రెండోది కలిసి పోరాడటం” అని చెప్పారు. అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. కరోనా వంటి వైరస్‌ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదని, ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదని, ప్రజలంతా బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాలన్నారు. అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావొద్దని పునరుద్ఘాటించారు. ప్రజలు పరస్పరం దూరం పాటించాలని, ఏకాంతంగా ఉండటం వల్ల ఈ మహమ్మారిని కట్టడి చేయొవచ్చని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?