జనం భరించాల్సిందే

పన్ను వాత.. ఛార్జీల మోత అతి త్వరలో..
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు పెంచుతాం
పన్నులు వసూలు చేయకపోతే సర్పంచ్‌లు, కార్యదర్శుల పదవులు పోతాయ్‌ : సిఎం కెసిఆర్‌ హెచ్చరిక
హైదరాబాద్‌ : మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్నులను, విద్యుత్‌ ఛార్జీలను పెంచనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా, జీతాల పెంపు కోసం నిధులు ఆకాశం నుంచి, వసతులు గాలిలో నుంచి రావని ప్రజలు భరించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామపంచాయతీలలో వంద శాతం పన్నులు వసూలు చేయకపోతే కొత్త గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్‌లు, కార్యదర్శుల పదవులు పొతాయని హెచ్చరించారు. అవసరమైతే ఎంఎల్‌ఎల జీతాలను తగ్గించైనా పంచాయతీలకు నిధులను అందిస్తామన్నారు. శాసనసభలో శుక్రవారం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది.ఈ చర్చలో సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, టిఆర్‌ఎస్‌ సభ్యులు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, గాదరి కిశోర్‌, ఎంఐఎం సభ్యులు జాఫర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ చర్చకు సమాధానమిస్తూ గ్రామ పంచాయతీలకు రూ.40 లక్షల తగ్గకుండా నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్‌ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని స్పష్టం చేశారు. పేదలపై తాము భారం వేయబోమని, పన్నులు చెల్లించేవారి స్థోమత మేరకే వసూలు చేస్తామని, ఎస్‌సి,ఎస్‌టిలకు 101 యూనిట్ల వరకు ప్రస్తుతం ఉన్న ఉచిత విద్యుత్‌ను అలాగే కొనసాగిస్తామన్నారు.
15వ ఆర్థిక సంఘం రానున్న ఆర్థిక సంవ్సతరానికి పంచాయతీలకు రూ. 1847 కోట్ల నిధులను ఇవ్వనుందని, దీనికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.1847 కోట్లను విడుదల చేస్తుందన్నారు. ఇతర చిన్న గ్రామ పంచాయతీలకు గాను సిఎం ప్రత్యేక నిధి నుండి కూడా అవసరమైన నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. పంచాయతీ ఉద్యమ స్ఫూర్తితో సహకార ఉద్యమం జరిగిందని, అలాంటి పంచాయతీ, సహకార ఎన్నికల్లో మద్యం ఏరులైపారుతోందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే విషయమై చట్టంలో కఠిన నిబంధనలు ఉండడంతో పరిపాలనలో జవాబుదారీ తనాన్ని పెంచిందన్నారు. వైకుంఠధామాల నిర్మాణానికి 11,982 గ్రామాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, 11,828 గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, వంద శాతం వీటిని పూర్తి చేస్తామన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా 12,616 గ్రామాల్లో డంప్‌ యార్డుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించామని, 12,124 గ్రామాల్లో నిర్మాణ పనులను ప్రారంభమైనట్టు వివరించారు. 2019- ఆర్థిక సంవత్సరంలో రూ.10.90 కోట్ల మొక్కలు నాటి 86 శాతం మొక్కలను సంరక్షించామన్నారు. గ్రామ పచ్చదనాన్ని పెంచేందుకు 2019- ఆర్థిక సంవత్సరంలో రూ. 237 కోట్లు ఖర్చు చేశామని, గ్రామ బడ్జెట్‌లో 10 శాతం నిధులను పచ్చధనానినికి వినియోగించేలా నిబంధనలు పెట్టినందుకు గాను 2020- ఆర్థిక సంవత్సరంలో రూ. 369 కోట్ల గ్రీన్‌ బడ్జెట్‌గా ఏర్పడుతుందన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా 1,00,005 మిడిల్‌ పోల్స్‌ ఏర్పాటు చేశామని, 72,387 వంగిన, పాడైన, తుప్పుపట్టిన పోల్స్‌ స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేశామని, 27,206 పాత స్ట్రీట్‌ లైట్‌ మీటర్లను మార్చినట్టు వివరించారు. పల్లె ప్రగతిని నిరంతరం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. అంతర్గత సర్వేలో గ్రామపంచాయతీలో పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మొదటిస్థానంలో ఉన్నారన్నారు.
లెక్క తప్పుగా తేలితే రెండేళ్లు జైలుకు, 20 రెట్లు జరిమానా
తమ ఇంటి కొలతల ఆధారంగా ఆస్తిపన్నులపై ఇంటి యజమానులే సెల్ఫ్‌ సర్టిఫై చేసుకునే వెసులుబాటు కల్పించామని, ఒక వేళ తప్పుడు లెక్కలు చెబితే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 20 రెట్లు పన్ను జరిమానా ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్‌ హెచ్చరించారు. మొక్కలను పెంచే బాధ్యతను కూడా ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు తెలిపారు.70 ఏళ్ల వరకు ప్రేమతో చూస్తే అవినీతి పెరిగిందని, తద్వారా గ్రామ పంచాయతీలు పెంటకుప్పలుగా మారాయని, ఆ తప్పులతో పాలకులు ఎందుకు తిట్లు పడాలని అభిప్రాయపడ్డారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ఎంపిలు, ఎంఎల్‌ఎలు అందరూ రాజ్యాంగ పరిధిలో ఎవరి స్థాయిలో వారు పనిచేస్తారని, అలాగే గ్రామ సర్పంచ్‌లు కూడా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. వార్డు పచ్చగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వార్డు సభ్యులపైనే ఉన్నదని, ఆ మాత్రం చూడకపోతే ఇక వార్డు సభ్యులు, సర్పంచ్‌లు ఎందుకని ప్రశ్నించారు. తాము ఓట్ల కోసం భయపడేవారిమి కాదని, కుండలో ఎంతుందో కుండ బద్దలు కొట్టినట్టే చెబుతామని, వాస్తవాలున వివరిస్తామని సిఎం అన్నారు. 2018 డిసెంబర్‌ ఎన్నికల్లో తాము లక్ష రూపాయాల రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తామని చెబితే, కాంగ్రెస్‌ పార్టీ రూ. 2లక్ష రైతు రుణాన్ని ఏకకాలంలో మాపీ చేస్తామన్నా రైతులు వారిని నమ్మకుండా తమకే ఓటు వేశారని, అది తమ విశ్వసనీయ అని వివరించారు. ఓట్ల కోసం భయపడే పరిస్థితి తాము లేమన్నారు. ప్రజలకు తమపై విశ్వాసం ఉండేలా పాలన అందిస్తున్నామన్నారు.
కరోనా రావాలంటే గజ్జున వనకాలె-
పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని, పచ్చదనం ఉండాలని, తద్వారా కరోనా లాంటి వ్యాదులు రావాలంటేనే గజ్జున వనకాలని సిఎం కెసిఆర్‌ అన్నారు . మన గ్రామాలను ఎవరో వచ్చి బాగు చేయరని, మనమే మేలుకోవాలని, మన సర్పంచ్‌లే పనిచేయాలని సూచించారు. మనుగోడు, మందమర్రి, ఆసిఫాబాద్‌, భద్రాచలం, సారపాక, పాల్వం చ లాంటి ఏజెన్సీ ప్రాంతాలను మున్సిపాలిటీ చేయాలా ? లేదా గ్రామ పంచాయతీ చేయాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంటుందని, అందుకే ఈ విషయమై గవర్నర్‌ ద్వారా కేంద్రానికి లేఖ పంపించామని తెలిపారు. ఈ ప్రాంతాలకు నిధుల విషయమై సిఎం ప్రత్యేక నిదుల నుండి విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధ్దంగా గ్రామాల అభివృద్ధి
ప్రణాళికబద్ధంగా గ్రామాలను అభివృద్ది చేస్తున్నామని, దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని సిఎం కెసిఆర్‌ అన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేశామని, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు విరాళాలు ఇస్తున్నారని, వరంగల్‌ రూరల్‌ జిల్లా దమ్మన్నపేటకు చెందిన కామిడి నర్సింహారెడ్డి రూ.25 కోట్ల విరాళం ఇచ్చారని, ఆయనతో పాటు పలువురు దాతను ఆయన అభినందించారు.

DO YOU LIKE THIS ARTICLE?