జంతర్‌ మంతర్‌ వద్ద 22 నుంచి రైతుల నిరసన

రోజూ 200 మందితో శాంతియుతంగా ఆందోళన
వెల్లడించిన రైతుసంఘాలు
న్యూఢిల్లీ: కొత్త సాగుచట్టాలను రద్దుచేయాల ని రైతులు ఈ నెల 22 నుంచి జంతర్‌ మం తర్‌ దగ్గర శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందువల్ల ఏ నిరసనకారుడు కూడా పార్లమెంటు దగ్గరికి వెళ్లకూడదని రైతు నాయకులు సూచించారు. ఢిల్లీ పోలీస్‌ అధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు. 22వ తేదీ నుంచి ప్రతీరోజు 200 మంది నిరసనకారులు గుర్తింపు బ్యాడ్జీలు ధరించి సింగు సరిహద్దు నుంచి జంతర్‌ మంతర్‌ దగ్గరికి వెళ్తారని రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ మహాసంఘ్‌ జాతీయ అధ్యక్షుడు శివ్‌కుమార్‌ కక్కా పేర్కొన్నారు. మూడు సాగుచట్టాలకు నిరసనగా 22వ తేదీ నుంచి ప్రతీరోజు పార్లమెంటు ఎదుట 200 మంది రైతులు బైఠాయించడానికి ఎస్‌కెఎం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఇలా ఉంటే నిరసనకారుల సంఖ్యను తగ్గించుకోవాల్సిందిగా ఢిల్లీ పోలీస్‌ అధికారులు రైతు నాయకులను కోరారు. అయితే ప్రదర్శన శాంతియుతంగా సాగుతుందని రైతు నాయకులు హామీ ఇచ్చారు. నిరసన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందని, రాజకీయ నాయకులు నిరసన స్థలం దగ్గరికి రారని రైతు నాయకులు పేర్కొన్నారు. కాగా తాము పార్లమెంటు ఎదుట బైఠాయించే విషయాన్ని ఢిల్లీ పోలీస్‌లు తప్పుగా ‘సన్సద్‌ ఘెరావ్‌’గా ప్రచారం చేస్తున్నారని ఎస్‌కెఎం ఆరోపించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటును ముట్టడించే ఉద్దేశమేదీ తమకు లేదని, ప్రదర్శన శాంతియుతంగా, క్రమశిక్షణతో ఉంటుందని ఎస్‌కెఎం ఇప్పటికే ప్రకటించింది. కాగా కనీస మద్దతు ధరకు చెల్లుకొట్టి, తమను బడా కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తాయని మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలాదిమంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. కేంద్రానికి, రైతులకు మధ్య ఇప్పటివరకు 11 విడతల చర్చలు జరిగాయి. అయినా ప్రతిష్టంభన తొలగిపోలేదు.

DO YOU LIKE THIS ARTICLE?