చొక్కా కత్తిరించి.. ముక్కుపుడక తొలగించి!

నీట్‌ పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు వింత అనుభవాలు
నీట్‌కు 80 వేల మంది హాజరు
హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆదివారం జరిగిన నీట్‌ పరీక్షకు సుమా రు 80 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. చాలా చోట్ల హడావుడి వాతావరణమే కనపడింది. ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు వచ్చిన విద్యార్థులు నీట్‌ నిబంధనలతో కాస్త గందరగోళానికి గురయ్యారు. “ఓ విద్యార్థిని ముక్కుపుడక చేత్తో తీయడానికి రాకపోయేసరికి, కటింగ్‌ ప్లేయర్‌తో తొలగించారు. మరికొందరు విద్యార్థులు పొడుగు చొక్కాలతో పరీక్షా కేంద్రాలకు రావడంతో లోపలికి అనుమతించేది లేదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో చేసేది లేక చొక్కాలు కత్తిరించుకుని లోపలికి వెళ్లారు”. వైద్య విద్యలో ప్రవేశాలకుగాను నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)కు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కఠిన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు, ఎత్తు మడమల చెప్పులు, చేతి గడియారాలు, బంగారు, వెండి ఆభరణాలు ధరించవద్దని, మంచినీళ్ల సీసా, పెన్ను, పెన్సిల్‌, స్కేలు, క్యాలిక్కులేటర్‌, ప్యాడ్‌, ఎరేజర్‌కు కూడా అనుమతిలేదని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద వస్తువులను భద్రపరిచేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోమని, అనుమతిలేని వస్తువులను ముందుగానే నివారించాలని సిబిఎస్‌ఈ హెచ్చరించింది. అయినప్పటికీ పలువురు విద్యార్థులు తొందరపాటుగా పరీక్షా కేంద్రాలకు రావడంతో అక్కడి అదికారులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ విద్యార్థులను లోపలికి పంపారు.

DO YOU LIKE THIS ARTICLE?