చైనాలో జలప్రళయం

25 మంది మృతి, పది లక్షలకుపైగా ప్రజలు ప్రభావితం
విపత్తు నష్టం తగ్గించాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశం

బీజింగ్‌: చైనాలోని మధ్య హెనాన్‌ ప్రావిన్స్‌లో జల ప్రళయం సంభవించింది. 1,000 ఏళ్లలో కనీవినీ ఎరగనంత భారీ వర్షం కురవడంతో హెనాన్‌ ప్రావిన్స్‌లో జనజీవితం అస్తవ్యస్తమైంది. వరదల కారణంగా కనీసం 25 మంది మరణించినట్లు, పదిలక్షలకు పైగా ప్రజ లు వరద ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. లక్షన్నరకుపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని సమాచారం. ఇక హెనాన్‌ రాజధాని జెంగ్జో నగరంలో ఎక్కడచూసినా నీళ్లే ఉండటంతో హోట ళ్లు, సబ్‌వేలు, బహిరంగ ప్రదేశాల్లో చిక్కుకుపోయిన ప్రజలు ప్రాణా లు అరచేతిలో పట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. నగరానికి సమీపంలో ఉన్న ఓ ఆనకట్ట తెగిపోతుందన్న భయాల మధ్య ప్రజలను రక్షించడానికి అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ బుధవారం సైన్యాన్ని దించారు. విపత్తు నష్టాన్ని వీలైనంత తగ్గించాలని ఆయన అధికారులకు సూచించారు. భారీ వర్షం కారణంగా కోటికిపైగా జనాభా ఉన్న జెంగ్జో నగరం వీధులు నదులను తలపిస్తున్నాయి. సబ్‌వే రైళ్లలో గొంతులోతు నీళ్లలో చిక్కుకున్న ప్రజలు రైలు కడ్డీలను పట్టుకొని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సబ్‌వే సొరంగాల్లో ఇరుక్కున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. జెంగ్జో వాణిజ్య ప్రాంతంలో ప్రజలు తమను చుట్టుముట్టిన నీళ్లను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా పదుల కొద్దీ కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రోడ్లపై ఉన్న భారీ గోతుల్లో ప్రజలు పడిపోతున్నట్లు కొన్ని వీడియోల్లో కనిపించింది. నగరంలోని ఓ సబ్‌వేలోకి వర్షం నీరు పోటెత్తడంతో సబ్‌వే రైలులో ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే వారి సంఖ్య ఎంతన్నది తెలియదు. ఇలా ఉంటే ఒక్క మంగళవారం రోజే జెంగ్జోలోని వాణిజ్య ప్రాంతంలో 45.75 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. వాతావరణం నమోదు చేయడం మొదలైనప్పటినుంచి ఇదే అత్యధిక ఒక్కరోజు వర్షపాతం అని చైనా అధికారిక పత్రిక జిన్హువా వెల్లడించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 12 మంది సబ్‌వే రైలు ప్రయాణికులు సహా 25 మంది మరణించినట్లు, 1,60,000మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హెనాన్‌ ప్రావిన్స్‌ ఎన్నో సాంస్కృతిక ప్రదేశాలకు, పారిశ్రామిక, వ్యావసాయిక కార్యకలాపాలకు నిలయం. మార్షల్‌ ఆర్ట్‌ నిపుణులైన బౌద్ధ భిక్షువులకు ప్రసిద్ధిచెందిన షావోలిన్‌ దేవాలయం కూడా వరదల్లో తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. రోడ్లపై భారీగా వరదనీరు నిలవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. బస్సులు, సబ్‌వే సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. జెంగ్జోడాంగ్‌ రైల్వే స్టేషన్‌లో 160కిపైగా రైలు సర్వీసులను రద్దుచేశారు. విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు నిలిచిపోయాయి. కాగా తాజా వరదలను హెనాన్‌ ప్రొవిన్షియల్‌, జెంగ్జో మునిసిపల్‌ వాతావరణ విభాగాలు 1వ స్థాయి విపత్తుగా ప్రకటించారు. వాతావరణ అంచనాల ప్రకారం హెనాన్‌లో బుధవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఇలా ఉంటే వరద నియంత్రణ, విపత్తు ఉపశమన బలగాలను సరిగ్గా నిర్వహించాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్ని స్థాయుల అధికారులను ఆదేశించారు. ప్రభావిత ప్రజలకు తగిన రక్షణ కల్పించి, విపత్తు వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించాలని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?