చిరు వ్యాపారులకు గడ్డుకాలమేనా?

లాక్‌డౌన్‌ విధించి 32 రోజుల పూర్తి
మారటోరియంను పట్టించుకోకుండా ఇఎంఐ కట్‌ చేస్తున్న కొన్ని సంస్థలు
బ్యాంకు రుణాలు రూ. 2.32 లక్షల కోట్లు డిఫాల్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందంటున్న ఆర్‌బిఐ
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌తో చిరు వ్యాపారులు గడ్డు కాలాన్నే ఎదుర్కొంటున్నారు. గడిచిన నెల రోజులుగా వ్యాపారాలు లేక వారు ఇళ్లకే పరిమితం కావడమే ఇందుకు ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది చిరు వ్యాపారులు ఉండగా తెలంగాణలో 25 లక్షల దాకా ఉన్నట్లు ఒక అంచనా. వీరంతా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, అటు బ్యాంకర్లకు రూ. 2.32 లక్షల కోట్లు డిఫాల్ట్‌ అయ్యే ప్రమాదం ఉందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేస్తోంది. కరోనాతో లాక్‌ డౌన్‌ కారణంగా ఫుట్‌పాత్‌ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు సాగక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రోజూ వ్యాపారాలు సాగితేనే తాము వివిధ బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తీసుకున్న డబ్బులు చెల్లించలేక అవస్థలు పడే వీరు ఇప్పుడు ఏకంగా 32 రోజులు లాక్‌డౌన్‌ పూర్తి చేసుకోవడం, ఇది ముగిసేందుకు ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొనడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. నెల వారీ వడ్డీలు చెల్లించాలని ఒత్తిడి చేసే వాళ్లు ప్రస్తుతానికి కాస్త ఓపిక పట్టినా లాక్‌డౌన్‌ తర్వాత మాత్రం ఏ మాత్రం ఆగరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు అన్నీ నిలిచిన ఈ వేళ రుణాలను ఎలా చెల్లిస్తారన్న దానిపైనా ఆయా రుణ సంస్థలు వివిధ అంచనాలను వేసుకుంటున్నాయి. తీసుకున్న రుణాలను చిరు వ్యాపారులు కడతారా? కట్టరా? ఒక వేళ కట్టని పరిస్థితే వస్తే ఎట్లా? అన్న దానిపైనా బ్యాంకర్లు ఆరా తీస్తున్నారు. డిగ్రీలు, పిజిలు చదువుకున్నా ఉద్యోగాలు రాక స్వయం ఉపాధి మేలని కొందరు పురుషులు, మహిళలు చిన్న చిన్న వ్యాపాల వైపు వచ్చారు. ఇందులో ఎవరి స్థాయిలో వారు పెట్టుబడులు పెడుతుంటారు. రూ. 50 వేల మొదలు కొని లక్ష నుండి 5 లక్షల వరకు పెట్టుబడులు పెడతారు. వ్యాపారాలు సాగుతున్నది చూసి బ్యాంకులు వారికి రుణాలు ఇస్తున్నాయి. దీంతో వ్యాపార విస్తరణను చేసుకుని కుటుంబాలను చూసుకుంటున్నారు. తినుబండారాలు, పండ్లు , టి స్టాల్స్‌ , టిఫిన్‌ సెంటర్లు, మొబైల్‌ ఉపకరణాలు వంటి వాటిని విక్రయించే వారిని చిరు వ్యాపారులుగా చెప్పవచ్చు. వీరే కాదు.. కూరగాయల దుకాణాలు, బుక్‌ సెంటర్లు, కుట్టు మిషన్‌, అల్లికలు, వస్త్ర దుకాణాలు వంటివి కూడా చిరు వ్యాపారాల కిందికే వస్తాయి. ఇలాంటి సంస్థలు రుణాలు తీసుకున్న చోట మూడు నెలల పాటు ఇఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెప్పినప్పటికీ కొన్ని సంస్థలు ఇఎంఐలను యధావిధిగానే కట్‌ చేసుకున్నాయి. బ్యాంకులు కాకుండా ఇతర సంస్థల నుండి రుణాలను తీసుకుంటే ఇఎంఐ కట్‌ అయ్యిందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. తినడానికే కష్టంగా ఉన్న ఈ రోజులు లాక్‌ డౌన్‌ తర్వాత వ్యాపారాలు సాగుతాయా? లేదా? ప్రజల వద్ద కొనుగోలు శక్తి ఇప్పటిలాగా ఉంటుందా? కొనుగోళ్లను కొద్ది మాసాలు వాయిదా వేసుకుంటారా? అన్న దానిపైనే చిరు వ్యాపారాల భవిష్యత్తు ఆధార పడి ఉంటుందని చెబుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?