చాపకింద నీరులా…!

పెరుగుతున్న కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 43 పాజిటివ్‌లు
జిహెచ్‌ఎంసి పరిధిలోనే 31 కేసులు
నీలోఫర్‌లో ఒక చిన్నారికి కొవిడ్‌ -19
809కి పెరిగిన కరోనా కేసులు సంఖ్య

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులాగ వ్యాపిస్తోంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొత్త కేసులు నమోదవుతూనే వున్నాయి. శనివారంనాడు కొత్తగా 43 కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసు లు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన బులిటెన్‌లో ప్రకటించింది. ఇందులో 31 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే వున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్త ఏడు కేసులు, అలాగే సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో మరో రెండేసి కేసులు చొప్పున, నల్లగొండ జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 809కి పెరిగింది. ఇందులో 605 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటివరకు 186 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు 18 మంది మరణించారు. శనివారం మరణాలు లేకపోవడం వైద్యబృందం సాధించిన విజయంగా చెప్పవచ్చు.  605 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మాస్కులను కచ్చితంగా ఉపయోగించాలని, పదేపదే చేతితో వాటిని సవరించవద్దని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. పౌరులంతా లాక్‌డౌన్‌ నియమాలను కచ్చితంగా పాటించాలని, సామాజిక దూరమే కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని తెలిపింది. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారు కచ్చితంగా సమాచారం  ఇవ్వాలని, ఎలాంటి లక్షణాలున్నా, అనుమానాలున్నా 104కు ఫోన్‌ చేయాలని కోరింది. తాజా వంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించింది.
నీలోఫర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారికి కరోనా!
హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నారాయణపేట జిల్లాకు చెందిన చిన్నారి అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారిని నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం ఆ చిన్నారికి నీలోఫర్‌లో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. చిన్నారి గ్రామాన్ని అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా దిగ్భందించారు. చిన్నారికి సంబంధించిన కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్ల సమాచారం.

DO YOU LIKE THIS ARTICLE?