చలో ఇంగ్లాండ్‌

ప్రపంచకప్‌ సందడి షురూ
ఐపిఎల్‌ ఖతం.. వరల్డ్‌కప్‌ సమరానికి రంగం సిద్ధం
మే 30 నుంచి జులై 14 వరకు వన్డే ప్రపంచకప్‌ పోటీలు
బరిలో 10 జట్లు.. హాట్‌ ఫేవరేట్‌గా టీమిండియా
(మరో 15 రోజుల్లో ప్రపంచకప్‌)
క్రీడా ప్రతినిధి: దాదాపు రెండు నెలలపాటు క్రికెట్‌ ప్రేమీకులను ఆలరించిన ధనాధన్‌ టోర్నీ ఐపిఎల్‌ ముగిసింది.. ఇప్పుడు క్రికెట్‌ ప్రేమికుల కోసం మరో మెగా సమరం వచ్చేస్తోంది. మే 30 నుంచి వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో ప్రపంచ దేశాల ఆటగాళ్లు ఒకే జట్టు ఆడగా.. ఇప్పుడు అదే ఆటగాళ్లు ప్రపంచకప్‌ మెగా ఈవెంట్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఢీకొననున్నారు. ఆర్‌సిబి తరఫున ఒకే జట్టులో ఆడిన విరాట్‌ కోహ్లీ, ఎబి డివిలియర్స్‌ ఇప్పుడు ప్రపంచకప్‌లో ప్రత్యర్థులుగా మారనున్నారు. క్రికెట్‌కు పుట్టినిళ్లయిన ఇంగ్లాండ్‌ వేదికగా ఈ క్రికెట్‌ పండగా జరగనుంది. మొత్తం 10 జట్లు 46 రోజుల మహాసంగ్రామంలో పాల్గొంటున్నాయి. ఈసారి రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో పోటీలను నిర్వహిస్తున్నారు. దాంతో ప్రతి జట్టు ఒకరితో ఒకరూ తలపడే అవకాశం ఉంటుంది. లీగ్‌ దశ ముగిసే సరికి ఏ జట్లయితే టాప్‌ ఫోర్‌లో ఉంటాయో ఆ జట్లు సెమీస్‌ బెర్త్‌లు ఖాయం చేసుకుంటాయి. మిగతా ఆరు జట్లు ఇంటి ముఖం పడుతాయి. 1992 ప్రపంచకప్‌ ఈ ఫార్మట్‌లోనే జరిగింది. ఇక ఇంగ్లాండ్‌ వేదికగా ఈ మెగా సమరం జరగనుండడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్రికెట్‌కు పుట్టినిళ్లు అయిన ఇంగ్లాండ్‌లో అద్భుతమైన క్రికెట్‌ స్టేడియాలో ఉన్నాయి. ఇక్కడి మైదానాలు ప్రపంచంలోనే టాప్‌లో ఉన్నాయి. ఇక్కడి లార్డ్‌ స్టేడియం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాలమైన ఈస్టేడియం ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లకు ఆథిత్యం ఇచ్చింది. ఇంగ్లాండ్‌లోని పచ్చిక మైదానాలు క్రికెటర్లకే కాకుండా అభిమానులకు సైతం భలేగా ఆకర్షిస్తాయి. ఇక పర్యటక పరంగా కూడా ఇంగ్లాండ్‌ క్రికెట్‌ ప్రేమీకులకు ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అందుకే ప్రపంచకప్‌ టికెట్లు హాట్‌ కేకుల్లా క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్‌ అభిమానుల ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 2019 కోసం ఇక్కడి ప్రధాన నగరాలు అంగరంగవైభవంగా ముస్తాబవుతునన్నాయి.
క్రికెట్‌ ప్రపంచకప్‌ విశేషాలు ఓసారి చూస్దాం..
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) నిర్వహించే వన్డే ప్రపంచకప్‌కు ప్రత్యేకమైన ఆకర్షన ఉంది. ఈ వన్డే ప్రపంచకప్‌ ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి నిర్వహించడం జరుగుతోంది. ఈ మెగా ఈవెంట్‌ను ఇంగ్లాండ్‌ అందరి కంటే ఎక్కువగా 4 సార్లు ఆతిథ్యం వహించింది. ఇప్పుడు తాజాగా ఐదో సారి కూడా ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. తొలి మూడు ప్రపంచకప్‌లు (1975, 1979, 1983) ఇంగ్లాండ్‌లోనే జరిగాయి. ఆ తర్వాత (1999)లోనూ ఇంగ్లాండ్‌ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ వరల్డ్‌కప్‌ నిర్వహించే అవకాశాన్ని ఇంగ్లాండ్‌ సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లాండ్‌ తర్వాత భారత్‌ ఎక్కువ సార్లు ప్రపంచకప్‌కు ఆథిత్యమచ్చిన దేశంగా రికార్డుల్లో నిలిచింది. భారత్‌లో (1987, 1996, 2011) మూడు సార్లు ప్రపంచకప్‌ పోటీలు జరిగాయి. తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా రెండు సార్లు, సౌతాఫ్రికా, జింబాబ్వేలు ఉమ్మడిగా ఒకసారి ప్రపంచకప్‌ను హోస్ట్‌ చేశాయి.
తిరుగులేని ఆస్ట్రేలియా..
1975 నుంచి 2015 వరకు మొత్తం 11 సార్లు ప్రపంచకప్‌ సమరం జరిగింది. అందులో అందరికంటే ఎక్కువ సార్లు ఆస్ట్రేలియా జట్టే ప్రపంచకప్‌ ట్రోఫీలను ఎగురవేసుకొని పోయింది. క్రికెట్‌ చరిత్రలో ఆస్ట్రేలియా తిరుగలేని జట్టుగా ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 11 సార్లు ప్రపంచకప్‌ పోటీలు జరుగగా.. అందులో ఆస్ట్రేలియా ఏకంగా 5 సార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఇప్పుడు తాజాగా ఆరో ప్రపంచకప్‌ ట్రోఫీపై ఆసీస్‌ జట్టు కన్నేసింది. క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ఆస్ట్రేలియా 1987లో తొలి సారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత 1999, 2003, 2007లలో హ్యాట్రిక్‌ విజయాలతో సంచలనం సృష్టించింది. వరుసగా మూడు ప్రపంచకప్‌ ట్రోఫీలను గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2015లో ఐదో ప్రపంచకప్‌ ట్రోఫీని కంగారూ జట్టు కైవసం చేసుకుంది. ఆ తర్వాత భారత్‌ (1983, 2011), వెస్టిండీస్‌ (1975, 1979)లలో తలో రెండు సార్లు ప్రపంచకప్‌లను గెలుచుకున్నాయి. మరోవైపు పాకిస్థాన్‌ (1992), శ్రీలంక తలోక్కసారి విజేతలుగా నిలిచాయి.
ఈసారి 10 జట్లే..
గత ప్రపంచకప్‌లో 14 జట్లు బరిలోకి దిగితే ఈ సారి ఆ జట్లను ఐసిసి 10 జట్లకు కుదించింది. ఈసారి గ్రూప్‌ పద్దతిలో కాకుండా రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ పది జట్లలో ఏ జట్లుయితే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి టాప్‌ 4లో చోటు సంపాదిస్తాయో ఆ జట్లు నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అయితే ఐసిసి ర్యాంకింగ్స్‌లో ఏ జట్లయితే టాప్‌ ర్యాంకుల్లో ఉన్నాయో ఆ జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన రెండు జట్లు అర్హత మ్యాచ్‌లలో పోటీ పడి చివరి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్‌ జట్టు కూడా అర్హత మ్యాచ్‌ల ద్వారా ఈసారి ప్రపంచకప్‌లో చోటు సంపాదించడం గమనార్హం. విండీస్‌తో పాటు అఫ్ఘనిస్థాన్‌ జట్టు కూడా క్వాలిఫైయర్‌ ద్వారా టాప్‌10లో చోటు సాధించింది.
ప్రపంచకప్‌ ఆడే పది జట్లు ఇవే:
1) భారత్‌, 2) ఇంగ్లాండ్‌, 3) ఆస్ట్రేలియా, 4) పాకిస్థాన్‌, 5) శ్రీలంక, 6) సౌతాఫ్రికా, 7) వెస్టిండీస్‌, 8) న్యూజిలాండ్‌, 9) బంగ్లాదేశ్‌, 10) ఆఫ్ఘనిస్థాన్‌.

DO YOU LIKE THIS ARTICLE?