చందా కొచ్చర్‌పై సిబిఐ కేసు

భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్స్‌ ఎండి వేణుగోపాల్‌ ధూత్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు

న్యూఢిల్లీ: ముంబయి: ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సిఇఒ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. వీడియకాన్‌ గ్రూప్స్‌ ఎండి వేణుగోపాల్‌ ధూత్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వీడియోకాన్‌ రుణాలకు సం బంధించిన కేసులో నిందితులుగా ఆరోపిస్తూ వీరి పై కేసులు పెట్టింది. మహారాష్ట్రలోని ముంబయి, ఔరంగాబాద్‌లలో ఉన్న వీడియోకాన్‌ కార్యాలయాలపై గురువారం ఉదయం సిబిఐ దాడులు చేసింది. వీడియోకాన్‌ గ్రూప్‌ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్‌ గత ఏడాది అక్టోబరులో ఐసిఐసిఐ బ్యాంకు సిఇఒ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్‌ గ్రూప్‌ రూ.3,250కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్‌ కుటుంబం లాభపడిందని ఆరోపణలు రావడంతో విషయం వివాదాస్పదమైంది. చందా కొచ్చర్‌ భర్తకు చెందిన కంపెనీలో వీడియోకాన్‌ ఎండి వేణుగోపాల్‌ ధూత్‌ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నెలల తర్వాత వీడియోకాన్‌కు రుణం మంజూరైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై సిబిఐ విచారణ మొదలెట్టింది. ‘నిందితురాలు నేరపూరిత కుట్రతో ప్రైవేట్‌ కంపెనీలకు రుణాలు ఇచ్చిందని, తద్వారా ఇతరులు ఐసిఐసిఐ బ్యాంక్‌ను మోసగించారు’ అని సిబిఐ ప్రతినిధి చెప్పారు. సిబిఐ గురువారం ముంబయి, ఔరంగాబాద్‌లో వీడియోకాన్‌ గ్రూపు కార్యాలయాలు, దీపక్‌ కొచ్చర్‌ నిర్వహించే నూపవర్‌ రినీవబుల్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. 2012లో ఐసిఐసిఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్లు వీడియోకాన్‌ గ్రూపుకు రుణం రూపంలో అందాక ఆ సంస్థ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ కోట్లాది రూపాయలను కొన్ని నెలలకు నూపవర్‌ కంపెనీలో పెట్టుబడి చేశారని ఆరోపణ. వేణుగోపాల్‌పై సిబిఐ ప్రాథమిక విచారణ చేపట్టిన 10 నెలలకు ఈ చర్చ చేపట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?