ఘోర ప్రమాదం

టైరు పేలి బస్సును ఢీకొన్న టాటా ఏస్‌ వాహనం

8 మంది దుర్మరణం

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన

ప్రమాదం పట్ల సిఎం కెసిఆర్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి దిగ్భ్రాంతి

ప్రజాపక్షం/దేవరకొండ/కొండమల్లేపల్లి : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద ఆర్‌టిసి బస్సు-ను టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన 15 మందిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన ఏడుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. టాటాఏసి వాహనంలో దాదాపుగా 20మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం దేవరకొండ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు(ఎపి 24 జెడ్‌ 0060)ను హైదరాబాద్‌ నుండి మల్లేపల్లి వైపు వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. ఘటనలో ఆటోలో ఉన్న వారిలో 8 మంది ఎగిరి కిందపడి మృతిచెందగా, మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, చింతపల్లి, మల్లేపల్లి, నెల్వలపల్లి గ్రామస్థులు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆర్‌డిఒ గుగులోత్‌ లింగ్యానాయక్‌, డిఎస్‌పి ఎస్‌.మహేశ్వర్‌, స్థానిక శాసనసభ్యుడు రమావత్‌ రవీంద్రకుమార్‌, తహశీల్దార్‌ రామకృష్ణ, ఆర్‌టిసి డిపో మేనేజర్‌ రామకృష్ణ, దేవరకొండ సిఐ వెంకటేశ్వర్లు తదితరులు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారిలో ఏడుగురిని మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా అధికారులు తెలిపారు. పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్‌, ఎస్‌పిలకు అందించినట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు కృషిచేస్తామని ఎంఎల్‌ఎ రవీంద్రకుమార్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?