గ్రేటర్‌పై పడగ!

ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలోనే 774 పాజిటివ్‌లు

ఒకేరోజు 985 కరోనా కేసులు!

రాష్ట్రంలో 12,349కి చేరిన మొత్తం కేసులు
మరో ఏడుగురు మరణం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిప్పులు చెరుగుతోంది. వైరస్‌ ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. పరీక్షల సంఖ్యను పెంచేకొద్దీ పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతోం ది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ కరో నా పడగ నీడలోవణుకుతోంది. జిహెచ్‌ఎంసి పరిధిని మినహాయించినా, రం గారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కొవిడ్‌ తీవ్రతలో వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 985 కరోనా కేసులు నమోదయ్యాయి. వెయ్యి మైలురాయికి కాస్త దూరంలో ఆగిపోయింది. మొత్తం కేసుల సంఖ్య మాత్రం 12 వేలు దాటిపోయింది. కొత్తగా మరో ఏడుగురు కరోనాకు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 237కి చేరింది. 24 గంటల్లో నమోదైన మొత్తం 985 కేసులకు గాను ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలోనే 774 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ జిల్లాలో 53 కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం వరంగల్‌ అర్బన్‌లో కరోనా వైరస్‌ వీరవిహారం చేసింది. ఒక్క ఈ జిల్లాల్లోనే 20 కేసులు నమోదయ్యాయి. మెదక్‌ జిల్లాలో 9, ఆదిలాబాద్‌లో 7, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆరేసి కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో మూడేసి కేసులు, ములుగు, జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రెండేసి కేసు లు, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ (మిర్యాలగూడ) జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. క్రమం తప్పకుండా కేసులు నమోదవుతున్న కరీంనగర్‌లో ఈసారి ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. వరంగల్‌ జిల్లాలో భారీగా కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు అత్యవసర చర్చలు జరిపారు. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తం గా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,349కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 7,436 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,766 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారంనాడు 78 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గం టల్లో నూతనంగా 4,374 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, అందులో 3,389 శాంపిల్స్‌ నెగిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు మొత్తం 75,308 మంది కి కరోనా టెస్టులు నిర్వహించారు. పరీక్షలు, ఆసుపత్రుల్లో బెడ్‌ల గురించి ఆందోళన వద్దని, ఎంతమందికైనా పరీక్షలు, చికిత్స చేసే సామర్థ్యం రాష్ట్రానికి వుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రైవేటు లేబొరేటరీలను ఎప్పటికప్పు డు నాలుగు బృందాలు తనిఖీ చేస్తున్నాయని, ఈ బృందాల్లో సీనియర్‌ మై క్రో బయాలజిస్టులు, ఆరోగ్యశాఖ సీనియర్‌ అధికారులు వున్నారని తెలిపిం ది. అయితే కొన్ని లాబొరేటరీల్లో భద్రతాపరమైన లోపాలు వున్నాయని, సి బ్బంది పిపిఇ పరికరాలు ధరించడం లేదని, సేఫ్టీ క్యాబినెట్లు కూడా వారికి అందుబాటులో లేవని తనఖీ బృందాలు గుర్తించినట్లు తెలిపింది. కొవిడ్‌ 19 చికిత్స కోసం ప్రభుత్వం గుర్తించి ఆసుపత్రులు 34 వున్నాయని, 17 వేలకుపైగా బెడ్‌లు అందుబాటులో వున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇంటికే పరిమితం కావాలని, భద్రతాపరమైన సూచలన్నీ పాటించాలని కోరింది. చిన్నపిల్లలు, వృద్ధులను ఇంటికే పరిమితం చేయాలని సూచించింది.
నిత్యావసరాలకు కొరత?

హైదరాబాద్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ 
మూతపడుతున్న దుకాణాలు 
స్తంబిస్తున్న వ్యాపార కార్యకలాపాలు 

ప్రజాపక్షం/హైదరాబాద్‌ కరోనా వైరస్‌ వేగంగా పౌరులపై పంజా విసురుతుండటంతో… హైదరాబాద్‌ మహానగరంలో మార్కెట్లు, దుకాణాలు మూత పడుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మార్కెట్‌లను మూసేయాలని స్వచ్ఛందంగా వ్యాపారులు నిర్ణయం తీసుకుంటున్నారు. నగరంలో చాలా చోట్ల వ్యాపారులు తమకు తామే దుకాణాలను తెరవడం లేదు. కరోనా వైరస్‌ ఎవరి ద్వారా ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితులు నెలకొనడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. పర్యవసానంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా వ్యాపార కార్యకలాపాలను బంద్‌ చేసుకుంటున్నారు. ఆహార వస్తువుల సరఫరాకు ప్రధాన కేంద్రమైన బేగంబజార్‌, సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లు బంద్‌ చేస్తే నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుందని నగర వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని బనారస్‌ పట్టు చీరల మార్కెట్‌ను బంద్‌ చేయగా, ఈనెల 28 నుంచి జులై 5వ తేదీ వరకు బేగంబజార్‌ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో మూసివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. అదే విధంగా శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు లాడ్‌బజార్‌ను మూసివేస్తున్నట్లు లాడ్‌ బజార్‌ ట్రేడ్‌ యూనియన్‌ వ్యాపారులు తెలిపారు. శుక్రవారం నుంచి జులై 5 వరకు సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌, సూర్యా టవర్స్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల్లో దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి జూలై 5 వరకు బంగారం దుకాణాల స్వీయ లాక్‌డౌన్‌ పాటిస్తామని సికింద్రాబాద్‌ గోల్డ్‌, సిల్వర్‌ జువ్వెలరీ, డైమాండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బూరుగు సూర్యప్రకాష్‌, జగదీష్‌ ప్రసాద్‌ వర్మ వెల్లడించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్‌ మార్కెట్‌గా ఉన్న ట్రూప్‌ బజార్‌ను వచ్చే ఆదివారం నుంచి స్వచ్ఛందంగా బంద్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఈ మార్కెట్‌లో జనాల రద్దీ బాగా పెరిగింది. పలువురు వ్యాపారులకు కరోనా వైరస్‌ సోకింది. ఈ క్రమంలోనే బేగంబజార్‌, ఫిల్ఖానా, సిద్ది అంబర్‌ బజార్‌లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలను నిర్వహిస్తున్నారు. బేగంబజార్‌ మార్కెట్‌ వారం పాటు బంద్‌ చేస్తున్నామని హైదరాబాద్‌ కిరాణ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు లక్ష్మినారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌లు తెలిపారు. బేగంబజార్‌లోని దాదాపు 700 హోల్‌సెల్‌ కిరాణా దుకాణాల నుంచి తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు ప్రతి రోజూ నిత్యావసర సరుకులు ఎగుమతి అవుతుంటాయి. రోజూ మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారని, దీంతో వ్యాపారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయని లక్ష్మినారాయణ చెప్పారు. ఈ మార్కెట్‌లో గత వారం రోజుల్లో 12 మంది వ్యాపారులకు కరోనా సోకిందని, అందులో ముగ్గురు మరణించారని తెలిపారు. కరోనా వైరస్‌ కట్టడికి ఈ నెల 28 నుంచి జులై 5 వరకు బేగంబజార్‌ మార్కెట్‌ పరిధిలోకి వచ్చే కిషన్‌గంజ్‌, మహరాజ్‌గంజ్‌ తదితర మార్కెట్‌లను పూర్తిస్థాయిలో మూసివేస్తున్నామని స్పష్టం చేశారు.
స్వచ్ఛంద లాక్‌డౌన్‌లోకి రాణిగంజ్‌…
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈనెల 28 నుంచి రాణిగంజ్‌ మార్కెట్‌లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తామని స్థానికులు ప్రకటించారు. దీంతో 8 రోజుల పాటు రాణిగంజ్‌ హబ్‌లోని 5 వేల షాపులు బంద్‌ కానున్నాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 920 కేసులు నమోదు కాగా, ఒక్క సికింద్రాబాద్‌ సర్కిల్‌లోనే 141 కేసులు నమోదయ్యాయి.
లాడ్‌ బజార్‌ బంద్‌… బోసిపోయిన చార్మినార్‌ పరిసరాలు…
పాతబస్తీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో చార్మినార్‌ సమీపంలోని లాడ్‌బజార్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ తరఫున స్వచ్ఛందంగా 15 రోజుల పాటు దుకాణాలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చార్మినార్‌ చుట్టూ ఉన్న ఇస్లామిక్‌ బుక్స్‌ షాపు యజమానులు సైతం స్వీయ లాక్‌డౌన్‌లోకి వెళ్లీపోయారు. దుకాణాలు మూతపడటంతో వినియోగదారులు లేకపోవడంతో చార్మినార్‌ పరిసర ప్రాంతాలు బోసిపోయాయి.

DO YOU LIKE THIS ARTICLE?