గులాబీ తీర్థం పుచ్చుకున్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి

ఆంధ్రాకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఢిల్లీలో టిఆర్‌ఎస్‌ నిర్ణయాత్మక పాత్ర : కెటిఆర్‌

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : ఆంధ్రలో చంద్రబాబు చేసింది ఏమీ లేదని, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఆయన కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు ఆరోపించారు. బిజెపి అంటేనే బిల్డప్‌ జాతీయ పార్టీ అని, ప్రధాని మోడీ, బిజెపి పరిస్థితి పైన పటారం, లోన లోటారం వలే ఉన్నదని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో యుపిఎ, ఎన్‌డిఎ పరిస్థితులు బాగా లేవని, ఢిల్లీలో టిఆర్‌ఎస్‌ నిర్ణయాత్మకమైన క్రియశీలక పాత్ర పోషించే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం గజ్వేల్‌ నియోజకవర్గంలో కెసిఆర్‌పై కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కెటిఆర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భం గా ఆయనకు గులాబీ జెండాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కెటిఆర్‌ మాట్లాడు తూ 10 సంవత్సరాల తర్వాతనైనా ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడం గజ్వేల్‌ ప్రజలను, సిఎం కెసిఆర్‌ను సంతోష్‌పెట్టే అంశమన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో నిధుల వరద పారుతోందని, ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. కోటి ఎకరాల తెలంగాణ మాగాణం కావాలని కెసిఆర్‌ పెట్టుకున్న కల త్వరలోనే నెరవేరబోతుందని తెలిపారు. రాష్ట్రం అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగాలని, అసెంబ్లీ ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో పునరావృత్తం కావాలన్నారు. 16 ఎంపి సీట్లలో విజయం సాధించే వరకు విరామం లేకుండా పనిచేయాలని ఆయన కార్యార్తలను పిలుపునిచ్చారు. యుపిఎ, ఎన్‌డిఎ పక్షాలు కలిసినా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ వచ్చే అవకాశాలు లేవన్నారు. యుపిలో బిఎస్‌పి, ఎస్‌పి రెండూ కాంగ్రెస్‌, బిజెపిని సమానంగా చూస్తున్నాయని, ఒడిశా సిఎం నవీన్‌ పట్నామక్‌ కూడా కాంగ్రెస్‌, బిజెపి వల్లనే దేశానికి నష్టమని చెబుతున్నారని, అలాగే ఎపిలో ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగెస్‌ అధ్యక్షులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి కూడా కేంద్రాన్ని శాసించే పరిస్థితులో ఉండాలనే అభిప్రాయంతో ఉన్నారని కెటిఆర్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?