గుండెకోతే!

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆవేదన
8లోగా రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ పూర్తి కానివ్వండి
సమగ్ర నివేదికకు ప్రభుత్వానికి ఉన్నతన్యాయస్థానం ఆదేశం

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ లీగల్‌ : ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడితే వాళ్ల శవాల్ని ఎత్తుకుని మో సేందుకు ఏ తల్లిదండ్రులకు చేతులు రావు. కళ్ల ముందు తిరిగే బిడ్డలు శవాలుగా ఉంటే ఏ తల్లిదండ్రులకైనా గుం డెకోతే. పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ధైర్యంగా ఉండాలి. సాఫ్ట్‌వేర్‌ సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్య త వహిస్తుందని ఆశిద్దాం. ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయనివ్వాలి’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను మే 8వ తేదీలోగా రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డులు హైకోర్టుకు హామీ ఇచ్చాయి. 8వ తేదీన ఈ కేసును తిరిగి విచారిస్తామని, రీ వెరిఫికేషన్‌, రీ కౌటింగ్‌ లో ఎంత మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యా రో ప్రభుత్వం నివేదిక ద్వారా తెలియజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారో పరిశీలించిన తర్వాత పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలనే పిటిషనర్‌ వినతిపై ఆలోచన చేయవచ్చునని ధర్మాసనం పేర్కొంది. ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్లను సరిగ్గా ఎవాల్యుయేషన్‌ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన వారి కు టుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం సోమవారం మరోసారి హైకోర్టు విచారణకు వచ్చింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పిల్‌ను విచారించింది. ఈ కేసులో ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. రీవాల్యుయేషన్‌ కోరుకునే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదని, గతంలో ఉన్న ఫీజును ఈసారి రద్దు చేశామని ప్రభుత్వం తరఫును అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జె.రామచందర్‌రావు చెప్పారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల పరీక్ష పత్రాలను మే 8లోగా రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ చేస్తామని హామీనిచ్చారు. రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ను మే 8లోగా పూర్తి చేసిన తర్వాత వారిలో (ఇప్పుడు ఫెయిల్‌ అయిన విద్యార్థుల్లో) ఎంత మంది ఉత్తీర్ణులయ్యారో తమకు నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. తొలుత పిటిషనర్‌ తరఫు లాయర్‌ దా మోదర్‌రెడ్డి వాదిస్తూ.. మొత్తం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులందరి జవాబు పత్రాల్ని తిరిగి మూల్యాంకనం చేసేలా ఉత్తర్వులు ఇ వ్వాలని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల జవాబు పత్రాలను హైకోర్టు ముందు ఉంచేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కూడా ఆయన వాదించారు. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయమని, వీటిని అడ్డుకునేలా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని దామోదర్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?