గాలికి వదిలేసినట్లేనా?

ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలుండవా!
కుటుంబసభ్యులకు సోకుతున్న వైరస్‌
వెలుగులోకి వచ్చిన కేసులే ప్రత్యక్ష నిదర్శనం
అయినా పరీక్షలు చేయని ప్రభుత్వం
లక్షణాలు బయట పడేసరికే హరించుకుపోతున్న ప్రాణాలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ; హైదరాబాద్‌ మహానగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో నగర వాసులు కలవరానికి గురవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుందని నగర వాసులు విమర్శిస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహించకపోవడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయని నగర ప్రజలు అంటున్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహించకపోవడంతో ఎవరికి వైరస్‌ ఉందా? లేదా? తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో పెద్దఎత్తున జన సంచారం పెరగడంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. కరోనా వైరస్‌ సోకిన వారి కుటుంబ సభ్యులకు అధికారులు పరీక్షలు చేయడం లేదు. లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్‌ సోకి లక్షణాలు బయటపడేసరికి రోగం ముదిరి ప్రాణాలు పోతున్నాయని బాధితులు వాపోతున్నారు. గోషామహల్‌లో నివాసం ఉండే ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. అయితే ఆయనకు కిడ్నీ, గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్నారు. జిహెచ్‌ఎంసిలో పనిచేసే ఆయన సమీప బంధువు ఫీవర్‌ ఆసుపత్రికి రెండు పర్యాయాలు తీసుకెళ్లారు. ఆయనకు ఇతర జబ్బులు ఉన్నాయని, కరోనా లక్షణాలు లేవని తిప్పి పంపించేశారు. కరోనా వ్యాధి తీవ్రం కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకేళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధ్థారణ అయింది. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అదే పరిస్థితిలో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ముందస్తు పరీక్షలు నిర్వహించి, సకాలంలో చికిత్స అందిస్తే బతికేవాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాము కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు అంటున్నారు. ఇక ఇటీవల రాంనగర్‌ రామాలయం సమీపంలో నివసించే వ్యక్తి(46) కరోనా వైరస్‌ సోకి మరణించారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు తాము పరీక్షలు చేయించుకుంటామని జిహెచ్‌ఎంసి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. 108కు ఫోన్‌ చేసినా రాకపోవడంతో చేసేదిలేక వారే కంటైన్మెంట్‌ను దాటి ప్రైవేట్‌ వాహనంలో ఫీవర్‌ ఆసుపత్రికి పరీక్షల కోసం వెళ్లారు. అక్కడి వైద్యులు మీకు ఎలాంటి లక్షణాలు లేవంటూ పరీక్షలు నిర్వహించేందుకు నిరాకరించారు. అయితే తమ కుటుంబంలో వైరస్‌ సోకి వ్యక్తి మృతిచెందాడని, మరో ముగ్గురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తమకు కూడా కరోనా పరీక్షలు చేయాలని మృతుడి భార్య వైద్యులకు కోరడంతో వారు పరీక్షలకు అంగీకరించారు. వారిలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. ముషీరాబాద్‌ బాకారంలో నివాసం ఉండే వృద్దుడు(82)కి కరోనా సోకింది. ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మంగళవారం మరణించారు. అయితే ఆ వృద్దుని కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయలేదు. కనీసం తమ ఇంటివైపు ఏ ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ రాలేదని వృద్దుని కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రైమరీ కంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహించాలని నగర వాసులు కోరుతున్నారు.
రక్షణ చర్యలు గాలికి…
మొదట్లో కరోనా సోకిన వ్యక్తి వారం రోజుల కిందటి నుంచి ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడ సంచరించాడనే విషయాలను ఆరా తీసేవారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేవారు. కరోనా సోకిన వ్యక్తిని కలిసిన వారిని అదుపులోకి తీసుకొని కరోనా పరీక్షలు నిర్వహించేవారు. అలాగే కరోనా సోకిన వ్యక్తి నివాసం ఉండే కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి, కాలనీలోకి రాకపోకలు జరగకుండా భారికేడింగ్‌ చేసి, జిహెచ్‌ఎంసి సిబ్బంది, పోలీసులు వారికి నిత్యవసర వస్తువులతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాట్లు చేసేవారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య ఉదుృతి పెద్దగా లేకుండే. ప్రభుత్వం ప్రైమరీ కంటాక్ట్‌లకు పరీక్షలు జరపడం నిలిపేయడంతో కేసుల ఉదృతి పెరిగిపోయింది. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తి నివాసాన్నే కంటైన్మ్‌ంట్‌ చేస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తికి 14 రోజుల అనంతరం లక్షణాలు బయటపడుతున్నాయి. వైరస్‌ సోకిన వ్యక్తి ఈలోపు అనేకమందిని కలవడంతో కేసుల సంఖ్య పెరిగేందుకు అస్కారం ఏర్పడుతుందని పలువురు వైద్యులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?