గల్లీ లీడర్ల దొంగ లెక్కలకు.. దారితప్పిన సరుకులు!

వలసకూలీల ఆకలి కేకలు
ఆధార్‌కార్డు ఉంటేనే సరుకులు
కార్డు లేకుంటే సరుకులు ఇవ్వని అధికారులు
లేకుంటే స్థానిక నేతల సిఫారసులు ఉండాల్సిందే
వలసకూలీలకు అందాల్సిన సరుకులు స్థానికులకు
సమాచార లోపంతో నేతలు చెప్పిన వారికే ఇస్తున్న అధికారులు
స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూస్తున్న కూలీలు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వలసకూలీల్లో ఆకలి కేకలు పుట్టిస్తుంది. దేశంలో వేగంగా కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెల్సిందే. లాక్‌డౌన్‌ కాస్తా వలసకూలీలను కల్లోలానికి గురిచేస్తోంది. పునరావాస సహాయక చర్యల్లో సైతం వలసకూలీలు అడుగడుగునా వివక్షతకు గురవుతున్నారు. వలసకూలీలకు 12 కిలోల బ్యియం, రూ.500 నగదు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరవాస చర్యలు వలసకూలీల ఆకలికేకలను అపలేకపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు వలసకూలీలను ఆదుకునేందుకు అడ్డింకిగా మారుతున్నాయి. బియ్యం, రూ.500 నగదు ఇవ్వడానికి ఆధార్‌కార్డు చూపించాలని అధికారులు అడుగుతున్నా రు. ఆధార్‌కార్డు లేని వారికి బియ్యం, రూ.500 నగదు ఇవ్వడం లేదు. అంబర్‌పేట్‌, అజాంపుర, పాతబస్తీ, నగరంలోని పలు ప్రాంతాల్లో సహాయం కోసం వెళ్లిన వలసకూలీలను గేట్‌ల దగ్గర ఆధార్‌కార్డు చూపించాలని సిబ్బంది అంటున్నారు. వెంట ఆధార్‌కార్డు తీసుకవచ్చిన వారిని మాత్రమే లోపలికి వదిలేస్తున్నారు. ఇక కార్డు లేని వారిని గేట్‌ల నుంచి గెంటివేస్తున్న ఘటనలు నగరంలో పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. అంబర్‌పేట్‌లో బియ్యం కోసం వెళ్లిన వలసకూలీలను ఆధార్‌ కార్డు చూపించాలని ప్రభుత్వ సిబ్బంది అడిగారు. లేదని చేప్పడంతో బలవంతంగా గేట్‌ ముందు నుంచి గెంటేశారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంబర్‌పేట్‌లో లభించకపోవడంతో అజాంపురలో బియ్యం పంపిణఈ చేస్తున్న కేంద్రం దగ్గరకు వెళ్లిన వలసకూలీలకు నిరాశే మిగిలింది. అక్కడ కూడా ఆధార్‌కార్డు చూపించాలని అడగడంతో వారు నిరాశగా వెనుతిరిగారు.
స్థానిక నేతలు ఎవ్వరికీ ఇవ్వమంటే వారికే బియ్యం
వలసకూలీలకు సహాయ పునరవాస చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ అధికారులు స్థానిక నేతలపై ఆధారపడుతున్నారు. స్థానిక నేతలు పేర్లు రాసిచ్చిన వారికే ప్రభుత్వ అధికారులు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ విషయాలు క్షేత్ర స్థాయిలో పరిశీలనలో వెల్లడయ్యాయి. నగరంలో అనేక ప్రాంతాల్లో వలసకూలీలు వివిధ పను లు చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నారు. మార్చి 22 జనతా కర్ఫ్యూ నుంచి మొదలైన లాక్‌డౌన్‌తో వలసకూలీలు ఉపాధి కోల్పోయారు. చాలా మంది కాలినడకన తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే నగరంలో చిక్కుకపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలుగా 12 కిలోల బియ్యం, రూ.500 నగదును వలసకూలీలకు అందచేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే వలసకూలీలు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయం ప్రభుత్వ అధికారులకు పూర్తి సమాచారం లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారుల బలహీనతలను ఆసరగా చేసుకొని కొంతమంది స్థానిక నేతలు పేర్లు రాసిస్తున్నారు. వీరే వలసకూలీలని చెబుతున్నారు. వలసకూలీలపై పూర్తి సమాచారం లేకపోవడంతో స్థానిక నేతలు పేర్లు రాసిచ్చిన వారికే బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంబర్‌పేట్‌లో స్థానిక ఎంఐఎం, టిఆర్‌ఎస్‌ నాయకులు రాసిచ్చిన వారికే సరుకులు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వలసకూలీలకు ఇవ్వాల్సిన బియ్యం, రూ.500 నగదును నేతలు స్థానిక ప్రజలకు ఇప్పిస్తున్నారని పలువురు వాపోయారు. ఇలా నగరంలో మలక్‌పేట్‌, అజాంపుర, ముషీరాబాద్‌, ఖైతరాబాద్‌, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, బోరబండ, అమీర్‌పట్‌, పంజాగుట్ట, బేగంపేట్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో స్థానిక నేతలు చెప్పిందే వేధంగా అధికారులు వ్యవహరించడంతో అసలైన లబ్ధిదారులైన వలసకూలీలకు బియ్యం, రూ.500 నగదు అందకూడా పోతోంది. చాలా మంది వలసకూలీలు తమ ఆధార్‌ కార్డులు తెచ్చుకోకపోవడంతో కూడా ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పొందలేని పరిస్థితులు నగరంలో నెలకొన్నాయి. స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఇచ్చే ఆహారం కోసం వలసకూలీలు ప్రతిరోజు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?