గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తా..

మేడ్చల్‌: గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌, సోనియా, రాహుల్‌, ఉత్తమ్‌ కుమార్‌కు బహుమతిగా ఇస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించేందుకు ప్రజలంతా చేయి చేయి కలపాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్‌ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సిఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. గతంలో టిడిపి హయాంలో 9, కాంగ్రెస్‌ హయాంలో 5 డీఎస్సీలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బంగారు తెలంగాణ చేస్తానని పదేపదే చెప్పిన కేసీఆర్‌ వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్నీ పరామర్శించలేదన్నారు. దళితుడిని సీఎంని చేస్తానన్న కేసీఆర్‌.. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో భూమిలే నోళ్లకు భూమి రాలేదని, నిరుద్యోగులకు ఉద్యోగం రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నెలలోనే సమగ్ర సర్వే చేశారని, ప్రజలంతా ఆ రోజు ఇంట్లో ఉండి అధికారులకు సహకరిస్తే.. ఆ సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. సమగ్ర సర్వే ఓ ఫాల్స్‌ సర్వే కాదా? కేసీఆర్‌ ప్రజల్ని మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు వస్తే దానిపై ఒక్కసారైనా సీఎం మాట్లాడలేదన్నారు. ఖమ్మంలో రైతులు తిరగబడితే సంకెళ్లు వేసి జైలుకు పంపారని మండిపడ్డారు. కవిత బతుకమ్మ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?