గంజిపై మక్కువ

పాత ఆహారపు అలవాట్లపై పెరుగుతున్న ఆసక్తి
చిరు ధాన్యాలపై విస్తృత ప్రచారం

ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : గంజి అంటే ఒకప్పుడు పేదరికానికి గుర్తు, పేదరికాన్ని అనుభవించిన వారు కలో గంజో తాగి బతికాం అని చెబుతుంటారు. పూర్తిస్థాయిలో ఆహారం దొరకని వారు జొన్న, సజ్జ, ఇతర చిరు ధాన్యాల గటక తాగి జీవించే వారు. వరి అన్నం తినడమంటే సంపన్నులకే సాధ్యమయ్యేది. ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో బంధువులు వచ్చినప్పుడు మాత్రమే వరి అన్నం వండే వారు. మూడు దశాబ్దాల క్రితం వరకు వరి అన్నం అంటే సంపన్నులు తినే ఆహారపు జాబితాలో ఉండేది. చాలా కాలం నడిచిన ఈ పద్దతి ఇప్పుడు తిరగబడింది. సంపన్నులు వరి అన్నం తినడం మానేసి గంజి తాగి బతుకుతున్నారు. పేదలు , దిగువ మధ్యతరగతి వారు హాయిగా వరి అన్నం తింటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, కొత్తగా చేరిన అనేక అలవాట్లు కొత్త రకం జబ్బులను తీసుకువచ్చాయి. వైద్యుల సలహాలకు తోడు కొత్త ఆహారపు పద్దతులపై జరుగుతున్న విస్తృత ప్రచారం ఒక్కసారిగా ఆహారపు అలవాట్లను మార్చేసింది. షుగర్‌, బిపి, గ్యాస్‌ ట్రబుల్‌, అల్సర్‌, శ్వాస కోశ వ్యాధులు, గుండె జబ్బులకు సంబంధించి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. వరి అన్నం విష పదార్థంగా కొంత మంది ప్రచారం చేస్తున్నారు. గంజి తాగండి, చపాతీలు తినండి, కొబ్బరి నూనెతో చేసిన వంటలు మరింత మంచిది, ఉప్పు కారం వద్దు ఊడకపెట్టుకుని తినండి, మంచి ఆరోగ్యానికి చిరు ధాన్యాలే శరణ్యమంటూ జరుగుతున్న ప్రచారంతో ఇవి తినకపోతే ఇబ్బందులు తప్పమోనన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. దీంతో క్రమేపి జనం నూతన ఆహారపు అలవాట్లకు అలవాటుపడుతున్నారు. జనం నాడిని బట్టి వ్యాపారాలు నిర్వహించే వారు ఇప్పుడు ఆహారపు అలవాట్లకు అనుగుణంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించారు. పల్లెలకు పాకకపోయిన పట్టణాల్లో మాత్రం వాడవాడలా గంజి కేంద్రాలు వెలిశాయి. భారీ సంఖ్యలో జనం ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు గంజి కేంద్రాల వద్ద గడుపుతున్నారు. జొన్న, రాగి, గటకలతో పాటు పండ్ల రసాల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. బీట్‌ రూట్‌, క్యారెట్‌ రసాల విక్రయాలు జోరందుకున్నాయి. ఇటీవల కాలంలో చిరు ధాన్యాల వాడకంపై విస్తృత ప్రచారం జరిగింది. జొన్నలు, రాగులు, కొర్రలు, ఊదలు, అరికెలు మొదలైన వాటి వినియోగం పెరిగింది. కొర్రన్నం తింటే జబ్బులు దూరమంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. ఒక స్థాయి కలిగి కొర్ర అన్నం తినని వారిని ఇప్పుడు దోషులుగా చూసే సమయం ఆసన్నమైంది. మొత్తంగా ఇవన్నీ కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న ఆహార పద్దతులు. ఇప్పుడు మళ్లీ మంచి ఆరోగ్యం కోసమంటూ పాత పద్దతులను అవలంభిస్తున్నారు.
ఒకప్పుడు గంజి తాగితే పేదరికం అనుభవిస్తున్నాడని చెప్పుకునే వారు. ఇప్పుడు గంజి తాగడమంటే ఆరోగ్యం కోసం తాగుతున్నాడన్న భావన బలపడుతుంది. మొత్తానికి గతం పునరావృతమవుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?