క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వసీం జాఫర్‌

ముంబయి : భారత వెటరన్‌ బ్యాట్స్‌మన్‌, మాజీ టీమిండియా ఓపెనర్‌, రంజీ లెజె్‌ండ వసీం జాఫర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ ఆడిన జాఫర్‌.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం అధికారికంగా ప్రకటించారు. 1996–97లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జాఫర్‌.. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌లో రాణించారు. జాఫర్‌ రిటైర్మెంట్‌ను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ’బీసీసీఐ డొమెస్టిక్‌’లో ధ్రువీకరించింది. ’నా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక తన రెండో ఇన్నింగ్స్‌పై దృష్టి పెడతా. ఈ ప్రయాణంలో సహకరించిన అందరి కోచ్‌లకు, బీసీసీఐ, ముంబై క్రికెట్‌ అసోషియేషన్‌, విదర్భ క్రికెట్‌ అసోషియేషన్‌లకు కృతజ్ఞతలు. సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవి్‌డ సౌరవ్‌ గంగూలీ, అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, ఎంఎస్‌ ధోనీలతో డ్రెసింగ్‌ రూం పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నా’ అని జాఫర్‌ పేర్కొన్నారు. ’సచిన్‌ నా రోల్‌ మోడల్‌. అతని ఆటను దగ్గర నుండి చూడటం నా అదృష్టం. చంద్రకాంత్‌ పండిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. తన కుమారులలో ఒకరు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని మా నాన్న కోరుకున్నారు. అతని కలను నెరవేరినందుకు నేను గర్వపడుతున్నా. కోచ్‌, కామెంటేటర్‌ తదితర అంశాలపై దృష్టి పెడుతా’ అని జాఫర్‌ తెలిపారు.
31 టెస్టులు.. 2 వన్డేలు

42 ఏండ్ల వసీం జాఫర్‌ భారత్‌ తరఫున 31 టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. 31 టెస్టులలో 1,944 పరుగులు సాధించారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు సాధించారు. టెస్టుల్లో వెస్టిండీస్‌ (212), పాకిస్థాన్‌పై (202) డబుల్‌ సెంచరీలు చేసారు. ఒకానొక సమయంలో టీమిండియా ఓపెనర్‌గా అద్భుతంగా రాణించారు. ఇక 2 వన్డేలు ఆడి 10 పరుగులు చేసారు. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన జాఫర్‌.. 2008లో దక్షిణాఫ్రికాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడారు. దక్షిణాఫ్రికాపైనే తొలి వన్డే, తొలి టెస్ట్‌ ఆడటం విశేషం.
260 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు..
260 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లతో రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా వసీం జాఫర్‌ రికార్డుల్లో నిలిచారు. 50.67 సగటుతో 19,410 పరుగులు చేశారు. దీనిలో 51 సెంచరీలు, 91 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 314 పరుగులు చేశారు. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్‌.. ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడారు. తన క్రికెట్‌ కెరీర్‌లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్‌.. తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించారు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ వసీం జాఫర్‌ అరుదైన ఘన త అందుకున్నారు. రంజీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో జాఫర్‌ తర్వాతి స్థానా ల్లో దేవేంద్ర బుందేల (145), అమోల్‌ ముజుందర్‌ (136) ఉన్నారు. ఇక రంజీ ట్రోఫీ చరిత్రలో 12,000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కూడా అరుదైన రికార్డు సాధించారు.

DO YOU LIKE THIS ARTICLE?