కోహ్లీ లోపం అదే: వివిఎస్‌ లక్ష్మణ్‌

హైదరాబాద్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ఈ మధ్య పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. పరుగుల యంత్రంగా పేరుపొందిన కోహ్లీ గత కొన్ని రోజులుగా వరుసగా విఫలమవుతూ తక్కువ స్కోరుకే ఔటవుతున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ అవుట్‌ అవడానికి గల కారణాలను భారత మాజీ క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ మెంటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ తెలియజేశాడు. ఈ మధ్య కోహ్లీపై బౌలర్లు ఎక్కువగా స్టడి చేస్తున్నారు. అతని బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ను స్పిన్నర్లు పసిగట్టేశారు. అందువల్లే కోహ్లీ స్పిన్నర్లను ఎదరుకొనలేక పోతున్నాడని లక్షణ్‌ పేర్కొన్నాడు. తాజా ఐపిఎల్‌ సీజన్‌లో కోహ్లీ ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్లు ఆడగా.. అందులో కోహ్లీ రెండుసార్లు స్పిన్నర్లకు తన వికెట్‌ సమర్పించుకున్నాడు. అందుకు కారణం విరాట్‌ బ్యాటింగ్‌ టెక్నిక్ను స్పిన్నర్లు దొరకబుచ్చుకోవడమేనని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. ఇలా స్పిన్నర్లకు కోహ్లీ పదే పదే ఔట్‌ కావడం తొలిసారి కాదని, గతంలోనూ చాలాసార్లు స్పిన్‌ బౌలింగ్లోనే అతను ఔట్‌ అయ్యాడు. ప్రధానంగా స్పిన్నర్ల వేసే గుగ్లీలకు కోహ్లీ ఔట్‌ అవుతున్నాడని లక్ష్మణ్‌ స్పష్టం చేశాడు. ఇక కోహ్లీ బలహీనతను పసిగట్టిన బౌలర్లు పదే పదే ఇతనిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తున్నారు. ఈ సమస్యను కోహ్లీ త్వరగా అధిగమిస్తే బాగుంటుందని, ఐపిఎల్‌ ముగియగానే ప్రపంచకప్‌ జరగనుంది. అందుకే కోహ్లీ తన బ్యాటింగ్‌ శైలిని ఒకసారి పరిశిలించుకొని లోపాలను సరిదిద్దుకుంటే బాగుంటుందని లక్ష్మణ్‌ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు.

DO YOU LIKE THIS ARTICLE?