కోల్‌కతాకు చివరి పరీక్ష

నేడు ముంబయితో కీలక పోరు
రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం
ముంబయి: ప్లే ఆఫ్‌ చివరి బెర్త్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేడు చివరి అవకాశం ఉంది. ఆదివారం వాంఖడే వేదికగా పటిష్టమైన ముంబయితో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఢీ కొననుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలను నిలుపుకున్న కెకెఆర్‌ ఇప్పుడు ముంబయితో జరిగే తమ లీగ్‌ చివరి మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సి ఉంది. మరోవైపు రన్‌రేట్‌ కూడా భారీ స్థాయిలో ఉంచుకుంటేనే ఈ జట్టు ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగలదు. అందుకే ఈ మ్యాచ్‌ కెకెఆర్‌కు చాలా కీలకం. ముంబయితో ఆడిన గత మ్యాచ్‌లో కెకెఆర్‌ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కెకెఆర్‌ బ్యాట్స్‌మెన్‌లు చెలరేగడంతో ముంబయికు ఓటమి తప్పలేదు. ఇప్పుడు మరోసారి ముంబయిని ఓడించి ఐపిఎల్‌లో తమ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని కెకెఆర్‌ భావిస్తోంది. ప్రస్తుతం కెకెఆర్‌ బ్యాట్స్‌మెన్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రసెల్‌తో ముంబయికి పెద్ద ముప్పు ఉందనే చెప్పాలి. ఇతనికి తోడుగా యువ ఓపెనర్‌ శుబ్‌మాన్‌ గిల్‌ కూడా మంచి లయను అందుకున్నాడు. ఇంకో ఓపెనర్‌ క్రిస్‌ లీన్‌ బంతిని వేగంగా బాదడంలో దిట్ట. రాబిన్‌ ఉత్తప్ప, కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌, సునీల్‌ నరైన్‌, నితీష్‌ రాణాలు బ్యాట్‌ను సిద్ధంగా ఉన్నారు. వీరిందరూ కలిసి చెలరేగితే రోహిత్‌ సేనకు కష్టాలు తప్పవు. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇటీవలే హైదరాబాద్‌ను ఓడించి మంచి జోష్‌లో ఉంది. ముంబయిను వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైన పెద్ద సవాల్‌ లాంటిదే. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరకున్న ఈ జట్టుపై ఒత్తిడి లేదనే చెప్పాలి. అందుకే ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబయి టాప్‌ బెర్త్‌పై కన్నేసింది. ప్రస్తుతం ముంబయి రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. అందుకే ముంబయి తన చివరి మ్యాచ్‌లో కెకెఆర్‌పై మంచి రన్‌రేట్‌తో గెలిస్తే.. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఓడితే ముంబయి నేరుగా అగ్ర స్థానానికి చేరుకుంటుంది. ముంబయి గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై భారీ విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో పై చేయి సాధించిన ముంబయి జట్టు సునాయాసంగా విజయం సాధించి ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ముంబయి ఆటగాళ్లు ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ప్రధాన బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతను ఒంటి చేత్తో సన్‌రైటర్స్‌ విజయాన్ని అడ్డుకున్నాడు. మంచి లయలో ఉన్న సన్‌ బ్యాట్స్‌మెన్‌లను వరుసగా పెవిలియన్‌ పంపడంతో పాటు పరుగులపై కూడా నియంత్రణ సాధించి తమ జట్టుకు అండగా ఉన్నాడు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్‌ డికాక్‌ మంచి ఫామ్‌ను అందుకున్నాడు. వరుస మ్యాచుల్లో చక్కనైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్నాడు. ఇతనితో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, లెవీస్‌, హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌లు చెలరేగితే కెకెఆర్‌కు కష్టాలు తప్పవు. వాంఖడే వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?