కొత్త పట్టాదారులకు ‘రైతుబంధు’ వచ్చే ఏడాదే!

ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన
జనవరి 23 సిసిఎల్‌ఎ జాబితాలోని రైతులకు అమలు
మార్గదర్శకాలు జారీ చేసిన వ్యవసాయ శాఖ
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కొత్త పట్టదారులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ‘రైతుబంధు’ను అమలు చేసే విషయా న్ని పరిశీలిస్తామని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. దశలవారీగా తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యత క్రమంలో నిధులను విడుదల చేస్తారు. బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా 2020, జనవరి 23న సిసిఎల్‌ఎ సమర్పించిన వివరాల ఆధారంగానే పట్టాదార్లకు రైతుబంధు వర్తిస్తుంది. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ బి. జనార్దన్‌ రెడ్డి ‘రైతుబంధు మార్గదర్శకాలను- (2020 విడుదల చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. రైతుబంధు అమ లు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. రైతుబంధును వదులుకునే వారు ‘గివ్‌ ఇట్‌ అప్‌’ ఫారం ఇవ్వాలని మార్గదర్శకాల్లో సూచించారు. కాగా ‘గివ్‌ ఇట్‌ అప్‌’ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమ చేస్తారు. పెద్దపల్లి కాసులపల్లిలో దేవాదాయ భూములు సాగుచేస్తున్న 621 మంది రైతులకు కూడా రైతుబంధును అమలు చేయనున్నారు. సుదీర్ఘకాలంగా ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నందున దీనిని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. అలాగే ప్రతి సీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలించి, అమ్మిన భూములను జాబితా నుండి తొలగించనున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?