కొత్త చరిత్రకు నాంది

తొలిసారిగా ఎం.3 ఇవిఎంలతో పోలింగ్‌
నిజామాబాద్‌లో ఎన్నికల తీరును పరిశీలించిన సుదీప్‌ జైన్‌

ప్రజాపక్షం/ నిజామాబాద్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక సరికొత్త చరిత్రకు నాంది కానున్నదని కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ అన్నారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో పర్యటించారు. ఎన్నికల తీరు తెన్ను, ఇవిఎంలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులు, నేషనల్‌ లెవల్‌ మాస్టర్‌ ట్రేనర్స్‌లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవిఎంల ద్వారా ఇంతవరకు దేశంలో కేవలం ఎం.2 ఇవిఎంలతో నాలుగు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించామన్నారు. ప్రస్తుతంనిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం లో ఎం.3 ఇవిఎంలతో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 12 బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నిజామాబాద్‌ ఎన్నికలు చాలెంజ్‌తో కూడుకున్నవని జైన్‌ స్పష్టం చేశారు. అతి తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎం.3 ఇవిఎంలతో ప్రపంచంలో ఇంత వరకు నిర్వహించలేదని, 12 బ్యాలెట్‌ యూనిట్లతో నిర్వహించడం నిజామాబాద్‌ పార్లమెంట్‌ వేదిక అవుతుందని జైన్‌ పేర్కొన్నారు. మనందరం చాలెంజ్‌గా తీసుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆయనన్నారు. సాంకేతిక నిపుణుల అవసరం, అధికారుల శ్రమ అత్యంత ప్రాధాన్యమని ఆయన వెల్లడించారు. సాంకేతిక లోపాలు వస్తే వెంటనే సరిదిద్దే ఏర్పాట్లు చేయాలన్నారు. సాంకేతిక నిపుణులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?