కొత్త కేసులు 983

తెలంగాణ రాష్ట్రంలో ఆగని కరోనా వేగం
జిహెచ్‌ఎంసి పరిధిలో మరో 816 పాజిటివ్‌లు
కొవిడ్‌ -19కు మరో నలుగురు బలి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శనివారం వెయ్యి మార్కు దాటిన కేసులు ఆదివారం ఆ మార్కుకు సమీపంలో ఆగిపోయా యి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 983 కొవిడ్‌ 19 కేసులు నమోదుకాగా, అందులో గ్రేటటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) పరిధిలోనే ఏకంగా 816 కేసులు రూఢి అయ్యాయి. కొత్తగా మరో నలుగురు కరోనాకు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 247కి చేరింది. ఇక రంగారెడ్డి జిల్లాలో 47, మంచిర్యాల జిల్లాలో 33 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌ జిల్లాలో 29, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో 19 కరోనా కేసులు పొడసూపాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 12 కరోనా కేసులు నమోదు కావ డం ఆ జిల్లా యంత్రాంగాన్ని భయపెడుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 కరోనా కేసులు, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో 3 చొప్పున కేసులు, గద్వాల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో రెండేసి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జనగామ జిల్లాలో ఒక్కో కరోనా కేసు నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,419కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 9,000 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 5,172 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారంనాడు 244 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 3,227 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, అందులో 2,244 శాంపిల్స్‌ నెగిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు మొత్తం 82,458 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

DO YOU LIKE THIS ARTICLE?