కొత్తగా 445 మరణాలు

భారత్‌లో 24 గంటల్లో 14,821 కొత్త కేసులు
మొత్తం మృతుల సంఖ్య 13,699
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. భారీ స్థాయిలో కొత్త కేసులు వస్తున్నాయి. వరుసగా 11వ రోజు కూడా 10 వేలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. సోమవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14,821 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,25,282కు పెరిగింది. వీరిలో 1,74,387 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,37,195 మంది కోలుకున్నారు. 24 గంటల్లో మొత్తం 9,440 మంది కరోనా బారిన పడ్డ వారు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా రివకరీ రేటు 55.77శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. కొత్తగా మరో 445 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 13,699కి పెరిగింది. ఈ నెల 21వ తేదీ వరకు మొత్తం 69,50,493 నమూనాలనుపరీక్షలు నిర్వహించగా, ఆదివారం ఒక్క రోజే 1,43,267 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) వెల్లడించింది. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం అమెరికా, బ్రెజిల్‌, రష్యా తరువాత ప్రపంచంలో భారత్‌నాలుగో స్థానంలో ఉంది. జూన్‌ 1 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 2,37,195 మందికి పైగా కరోనా బారిన పడ్డా రు. అయితే
దేశంలో మూడు లక్షల కేసుల దాటిన తరువాత కేవలం 8 రోజుల్లో నాలుగు లక్షలకు చేరుకోవడం గమనార్హం. బాధితల సంఖ్య పెరుగుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం గణనీయంగా కొత్త కేసులు వస్తున్నాయి.
మహారాష్ట్రలో అంతకంతకూ పెరుగుతున్న మృతులు
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,32,075 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 186 మంది మృతి చెందడంతో కొవిడ్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,170కి చేరింది. కరోనాతో నెలకొన్న పరిస్థితులతో ముంబయి మహానగరం విలవిలలాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే 63 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 2,175 మంది చనిపోగా, 59,746 కేసులు నమోదయ్యాయి. అటు తమిళనాడులోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 59,377 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 53 మంది మరణించారు. మొత్త మృతుల సంఖ్య 757కు చేరింది. గుజరాత్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,260 ఉండగా, ఇప్పటి వరకు 1,663 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో 17,731 కేసులు నమోదు కాగా, 550 మంది మరణించారు.
లక్ష జనాభాను తీసుకొని లెక్కిస్తే భారత్‌లోని అతి తక్కువ కేసులు
ప్రపంచ దేశాల్లో సగటున లక్ష జనాభాను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తే, భారత్‌లో అధిక జనాభా ఉన్నప్పటికీ అతి తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు దాదాపు 56 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించింది. ‘భారత్‌లో ఒక లక్ష జనాభాకు 30.04 కరోనా కేసులు ఉండగా, ప్రపంచ దేశాల్లో సగటు మూడు రెట్లు అంటే 114.67మంది కరోనాతో బాధపడుతున్నారు” అని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికాలో లక్ష జనాభాకు 671.24 మంది కరోనా బారిన పడగా ఆ తర్వాత, జర్మనీ (583.88), స్పెయిన్‌ (526.22), బ్రెజిల్‌ (489.42), బ్రిటిన్‌ (448.86) దేశాలు ఉన్నాయి. అదే విధంగా రష్యాలో ప్రతి లక్ష జనాభాకు 400.82 కేసులు ఉండగా, ఇటీలీలో 393.52, కెనడాలో 268.98, ఇరాన్‌లో 242.82, టర్కీలో 223.53 కేసులు ఉన్నాయి. ఈ గణాంకాలు చాలు కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పడానికి, కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా నియంత్రణలో తీవ్రంగా కృషి చేస్తున్నాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది. తాజాగా 24 గంటల్లో ఏకంగా 14,821 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 4,25,282కు చేరింది. కొవిడ్‌ 19 టెస్టింగ్‌ సదుపాయాల పెంపు కొనసాగుతుందని, ప్రభుత్వ ల్యాబ్‌లను సంఖ్య 723కు, ప్రైవేట్‌ ల్యాబ్‌ల సంఖ్యను 262కు పెంచగా, మొత్తం ఆ సంఖ్య 985కు చేరినట్లు కేంద్ర తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?