కొత్తగా 10 కేసులు

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు మాత్రమే రెడ్‌జోన్‌లో
మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్‌” రాష్ట్రంలో పది కరనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. రెడ్‌జోన్‌ పరిధిలోని సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌ జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌ పరిధిలోనికి మార్చాలని, అలాగే ఆరెంజ్‌ జోన్‌ పరిధిలోని మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, జయశంకర్‌ -భూపలపల్లి, కరీంనగర్‌, సిరిసిల్లా, మంచిర్యాల, నారాయణపేట, వికారాబాద్‌, నల్లగొండ, జగిత్యాల, ఆసిఫాబాద్‌, జనగామ జిల్లాలను గ్రీన్‌జోన్‌ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1132 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, తాజాగా 34 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, మొత్తం 727 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 376 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా నమోదైన కేసులన్నీ జిహెచ్‌ఎంసి నుంచే వచ్చాయన్నారు. 14 జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి, మరో మూడు జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌ జాబితాలో మారిస్తే రాష్ట్రంలో 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశాలు ఉంటాయని, ఆ ప్రాంతాల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 16 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయని, అందులోనూ కేసుల సంఖ్య తగ్గుతున్నాయని చెప్పారు. కేసుల సంఖ్యను బట్టి కంటైన్మెంట్‌ను అమలు చేసే విధానం ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మాత్రమే రెడ్‌జోన్‌లో ఉన్నాయని అందులోనూ త్వరలోనే కేసుల సంఖ్య తగ్గుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?