కేంద్రం దిగిరాకుంటే.. నిరవధిక సమ్మె

జాతీయ కార్మిక సంఘాల హెచ్చరిక
మూడు రోజుల సమ్మె విజయవంతం
బొగ్గుగని కార్మికులకు జేజేలు
ప్రజాపక్షం/ హైదరాబాద్‌  కేంద్రం బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకుంటే దేశవ్యాపితంగా నిరవధిక సమ్మె చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని జాతీయ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. గురువారం నుండి దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు జరిగిన సమ్మెలొ పాల్గొని విజయవంతం చేసిన సింగరేణి కార్మిక వర్గానికి ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియుసి,హెచ్‌ఎంఎస్‌, బిఎంస్‌ల అనుబంధ సింగరేణి కార్మిక సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై గట్టయ్య, వి.సీతారామయ్య, జనక్‌ ప్రసాద్‌, రియాజ్‌ అహ్మద్‌, టి.రాజికెడ్డిలు విప్లవ జేజేలు తెలిపారు. శనివారం నాయకులు గోదావరిఖని గనులను సందర్శంచి సమ్మె విజయవంతానికి కృషి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ దేశ వ్యాపితంగా సమ్మె నూరు శాతం విజయవంతమైందని, దాదాపు ఆరు లక్షల పర్మనెంటు,కాంట్రాక్టు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారని, లక్షలాది టన్నుల బొగ్గు ఉత్పత్తి స్తంభించి వందల కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్ప కలగాలన్నారు. సింగరేణిలో టిఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒకరోజు సమ్మెకు మద్దతిచ్చి మిగతా రెండు రోజులు సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడిందని, అయినా కార్మిక వర్గం సమ్మెలోపాల్గొని వారికి బుద్ధి చెప్పిందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిలో ఔట్‌ సోర్సింగ్‌, కంట్రాక్టీకరణ విపరీతంగా పెరిగిందని, గతంలో లేని విధంగా బొగ్గుతీసే పనులు కూడా ప్రైవేటీకరిస్తునాన్నారని, అందుకే సిఎం కెసిఆర్‌ కేంద్రం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విఫలం చేయడానికి కుట్ర పన్నిందని, ఈ నేపథ్యంలోనే కార్మికులు సంపూర్ణంగా సమ్మె చేసినట్లు వారు వివరించారు. భవిష్యత్తులో జరుగబోయే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల నాయకులు పిలపునిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?