కేంద్రం గుడ్‌ న్యూస్‌

ఐటి రిటర్నులుకు గడువు పొడిగింపు
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌ డౌన్‌లో ఉంది. దీంతో 2018–19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ గడువును జూన్‌ 30 వరకు పొడిగించినట్టు పేర్కొన్న ఆనే ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికే ఈ లాక్‌డౌన్‌ విధించినట్టు ఆమె పేర్కొన్నారు. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందన్న నిర్మలా ఆర్థిక సంవత్సరం చివరు రోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆర్థిక శాఖ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఆధార్‌-పాన్‌ అనుసంధానం గడువును కూడా జూన్‌ 30 వరకూ పొడిగిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. టిడిఎస్‌ జమాలో ఆలస్య రుసుముని కూడా 18% నుంచి 9%నికి తగ్గించ నున్నట్టు ఆమె తెలియజేశారు. అంతేకాక ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం గడువును కూడా జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపులో 10% అదనపు రుసుం ఉండదని ఆమె పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్‌, మే జిఎస్‌టి రిటర్నులు దాఖలు చేసేందుకు సైతం గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?