కెసిఆర్‌ సభ అట్టర్‌ఫ్లాప్‌

జనంలేక వెలవెలబోయిన ఎల్‌బి స్టేడియం ప్రచారసభ
అంచనా రెండు లక్షలు.. వచ్చింది 20 వేలు
ఆగ్రహంతో సభను రద్దు చేసిన గులాబీబాస్‌

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డులో టిఆర్‌ఎస్‌ శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. రెండు లక్షల మంది జనం హాజరవుతారని టిఆర్‌ఎస్‌ నేతలు చెప్పిన అంచనాలు తలకిందులయ్యాయి. అందులో కనీ సం పదోవంతు జనం రాకపోవడంతో సభ వెల వెలబోయింది. దీంతో సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన సిఎం కెసిఆర్‌ తన కార్యక్రమా న్ని రద్దు చేసుకున్నారు. ఎల్‌.బి.స్టేడియంలో శుక్రవారం సాయంత్రం టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేసింది. సిఎం హాజరుకానుండడంతో అట్టహాసంగా ఏర్పాట్లు కూడా చేసింది. నగర పరిధిలోని సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవేళ్ల, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేశారు. లోక్‌సభ అభ్యర్థులు డా.నిరంజన్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, తలసాని సాయికిరణ్‌, పుస్త శ్రీకాంత్‌తో పాటు మంత్రులు మహ్మద్‌ మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యదవ్‌, సి.హెచ్‌ మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మేయర్‌ రాంమోహన్‌, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు తదితరులు ముందే వచ్చారు. సాయంత్రం సభ కావడంతో ఆయా నియోజకవర్గాలకు చెంది న నాయకులు, కార్యకర్తలు మెల్లమెల్లగా సభ స్థలికి చేరుకున్నారు. సాయంత్రం అయినప్పటికీ సభస్థలికి జనాలు రాలేదు. ప్రజలు బయట ఉన్నారని కొద్దిసేపు సభ వేదిక మీద ఉన్న నాయకులు భావించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటలకు దాటుతున్నప్పటికీ సభ స్థలి నిండలేదు. కనీసం సగం కూడా నిండకపోవడంతో సభ కళతప్పింది.
విస్మయానికి గురైన గులాబీ శ్రేణులు..
సభకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ వస్తారని నాయకులు, ప్రాంగణంలోని జనాలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. నల్లగొండ సభ ముగించుకుని మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి సభస్థలికి రాబోతున్నారని మేయర్‌ బొంతు రాంమోహన్‌ ప్రకటించారు. అప్పటి రకు లోక్‌సభ అభ్యర్థుల ప్రసంగాలను ముగించారు. అయినా సభ ప్రాంగణం సగానికిపైగా ఖాళీగానే కనిపించింది. కొద్దిసేపు కళాకారులు పాటలు పాడారు. అప్పటికీ జనాలు రాకపోగా ఇక తిరుగుప్రయాణం మొదలు పెట్టారు. ఇంతలో సభకు రావడం లేదని ముఖ్యమంత్రి నుంచి నాయకులకు సమాచారం అందింది. కానీ ఈ విషయాన్నీ ఎవ్వరికీ చెప్పకుండా మంత్రుల ప్రసంగాలను ప్రారంభించారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రసంగిస్తూ సిఎం కెసిఆర్‌ నల్లగొండ సభ నుంచి ఇక్కడికి రావడానికి మరో రెండు గంటల సమయం పడుతుందని, మరోసారి నిర్వహించే హైదరాబాద్‌ సభకు హాజరవుతారని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అటు పార్టీ శ్రేణులు,ఇటు ప్రాంగణంలోని జనాలు తీవ్ర నిరాశకు గురయ్యారు. సిఎం కవరేజీకి వచ్చిన జర్నలిస్టులు సైతం విస్తు పోయారు. వాస్తవానికి అప్పటికే సిఎం కెసిఆర్‌ నల్లగొండ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. సభకు జనం రాలేదని తెలిసి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

DO YOU LIKE THIS ARTICLE?