కెసిఆర్‌ ఆర్థిక ఉగ్రవాది

కాసుల కోసం రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారు
రాజకీయ లబ్ధికోసమే జలవివాదం
టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆర్థిక ఉగ్రవాదిగా మా రి, కాసుల కోసం తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నారని టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.కృష్ణా జలాల విషయంలో సిఎం కెసిఆర్‌ కృత్రిమ పంచాయి తీ పెడుతున్నారని, జల వివాదాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నార ని,ఆ ట్రాప్‌లో పడొద్దన్నారు. హైదరాబాద్‌లో టిపిసిసి సీనియర్‌ ఉపాధ్యక్షుడు సురేష్‌షట్కర్‌ నివాసంలో టిపిసిసి అనుబంధ సంఘాలతో గురువారం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్ల దోపిడీలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాత్ర లేదని, ఆయన కుమారుడు వై.ఎస్‌.జగన్‌ హస్తం ఉన్నదని, కాంగ్రెస్‌ అభిమానులను తప్పు దారి పట్టించేందుకే కెసిఆర్‌ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. సిఎం కెసిఆర్‌ పాలనలో తెలంగాణ ఎలా వంచనకు గురైందో తమ సమావేశంలో చర్చించామని, ఈనెల 7 తర్వాత అన్ని విభాగాల అధ్యక్షులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. నీళ్ల కెసిఆర్‌కు ఓటు బ్యాంకుగా మారిందని విమర్శించారు. కావాలనే లేని పంచాయతీని సృష్టిస్తున్నారన్నారు. అంతర్జాతీయ నీటి సూత్ర ప్రకారం పరీవాహాక ప్రాంతం కాకుండా ఇతర చోట్లకు పంపడం కరెక్ట్‌ కాదన్నారు. ఎపి సిఎం జగన్‌ కృష్ణా నీటిని రోజుకు 11 టిఎంసిలు తరలించేలా ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో మాత్రం అన్ని ప్రాజెక్టులకు కలిపి రోజుకు ఒక టిఎంసి మాత్రమే వాడుకోగలమన్నారు. నీటి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చట్టబద్ధత తీసుకొచ్చిందని, జలాల కోసం ప్రభుత్వం పోరాటం చేయాలి కానీ, రాయలసీమ ఎత్తిపోతల మీద సామాన్య రైతు గవినొళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారని గుర్తు చేశారు. రైతు వేసిన పిటిషన్‌లో అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయ్యిందన్నారు. రెండున్నర కోట్ల ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాస్తుంటే.. సిఎం కెసిఆర్‌ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఈనెల 8న రాజశేఖర్‌రెడ్డి కూతురు రాజకీయ పార్టీ పెడుతుందట అని, వై.ఎస్‌ షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతుందని, షర్మిల వైపు నడిపించేందుకు కెసిఆర్‌ డ్రామా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎన్‌టిఆర్‌, వైఎస్‌ఆర్‌ అంటే ఒక శకమని, సంక్షేమం ద్వారా చేయాల్సింది చేశారని, తెలంగాణ సమాజానికి వారికి అభిమానం ఉన్నదని తెలిపారు. నాగార్జునసాగర్‌ మీద గస్తీ పెట్టారంట అని, సాగర్‌ తెలంగాణ రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. రాజశేఖర్‌ రెడ్డిని తిట్టడం ద్వారా రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు వై.ఎస్‌. ఎన్‌టిఆర్‌ రాజకీయాలకు అతీతులని, వారిని విమర్శించే వాడు నికృష్టుడే అని అన్నారు. రాష్ట్ర మంత్రులు ప్రెస్‌ మీట్లు పెట్టడం ద్వారా నీటి సమస్య పరిష్కారం అవుతుందా? కోర్టులో కేసులు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు గతంలో అనుకూలంగా ఉన్న వ్యక్తులు, శక్తులు మళ్లీ తిరిగి వస్తుంటే కెసిఆర్‌ కుట్రలు చేస్తున్నారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?