కుల,మత ప్రస్తావనలేని జనగణనపై మీ వైఖరేమిటి?

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కుల, మత ప్రస్తావన లేకుండా కూడా జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి, జనన, మరణ ధ్రువీకరణ అధికారులతోపాటు కొత్తకోట మున్సిపాల్టీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో తమ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. హైదరాబాద్‌లో నివాసముంటున్న రూప, డేవిడ్‌ దంపతులు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు సోమవారం విచారణ చేసింది. 2019 మార్చి 23న జన్మించిన తమ కొడుకు ఇవాన్‌ రూడే జనన ధ్రువీకరణ ప త్రం కోసం తల్లిదండ్రులు కొత్తకోట మున్సిపాలిటీ వెళ్లారు. కు ల,మత వివరాలు విధిగా ఇవ్వాలని అధికారులు కోరితే ఇచ్చేందు కు వారు నిరాకరించారు. కుల,మత ప్రస్తావనలు లేకుండా జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఏడాది అయినా ఇప్పటి వరకూ బెర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. త మిళనాడుకు చెందిన న్యాయవాది ‘ఎం.స్నేహ’ చేసిన న్యాయ పో రాటంలో బెర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లల్లో కుల,మతాల ప్రస్తావన లేకుండా జిల్లా కలెక్టర్‌ నుంచి ధ్రవీకరణ పత్రాన్ని పొందారనే సమాచారాన్ని వారు హైకోర్టు దృష్టికి తెచ్చారు. కుల,మతాలకు అతీతంగా తాము జీవిస్తున్న తమ కుమారుడికి కుల ప్రస్తావన లేని బెర్త్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలి.. అని వారి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. కుల, మతాలపై నమ్మకం ఉండటం ఎలాంటిదో వాటిపై నమ్మకం లేకపోవడం కూడా అంతేనని పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?