కింది కోర్టుకే వెళ్లాలి

ఎంపి రఘురామకు ఎపి హైకోర్టు స్పష్టీకరణ
హౌస్‌మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ
అమరావతి :
వైఎస్‌ఆర్‌సిపి రెబెల్‌ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసుకున్న హౌస్‌మోషన్‌ను పిటిషన్‌ను ఎపిహైకోర్టు తిరస్కరించింది. సిబిఐ లేదా జిల్లా కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా విమర్శలు, ఆరోపణలు చేశారన్న ఆరోపణలపై ఎపి సిఐడి అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, తనకు బెయిల్‌ను మంజూరు చేయాలని కోరుతూ రఘురామ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో బెయిల్‌ ఇవ్వాలని తన పిటిషన్‌లో ఆయన కోరారు. అయితే, హైకోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. బెయిల్‌ కోసం కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. అసలు కింది కోర్టులను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని సూచించింది. అదే సమయంలో, రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. తీర్పుకాపీని వెంటనే ఇవ్వాలని సూచించింది. రఘురామను వెంటనే రిమాండ్‌కు పంపనున్నట్టు ఎపి ప్రభుత్వతరఫు న్యాయవాది పేర్కోగా, ఆయన ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మంగళగిరి సిఐడి పోలీస్‌ స్టేషన్‌లో 124ఎ, 153ఎ, 120బి, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరో రెండు చానెల్స్‌పైన కూడా కేసులు నమోదైనట్టు సమాచారం.

DO YOU LIKE THIS ARTICLE?