కాళ్లను నమ్ముకున్న కష్టజీవులు

ఆంధ్రా టు మధ్యప్రదేశ్‌ వయా తెలంగాణ
చూపరులను సైతం కన్నీరు పెట్టిస్తున్న నడక దృశ్యాలు
ఆగని వలసలు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో: లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీల పరంపర ఒక పక్క కొనసాగుతుంది. మరో పక్క వలస కూలీల నడక విరామమెరుగక సాగుతోంది. లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు ఏ దరి చేరుతున్నాయో కానీ పొట్ట కూ టి కోసం వందల కిలోమీటర్లు వచ్చిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చలేకపోతున్నాయి. వందల కిలోమీటర్ల దూరం, మండుటెండలు, తినడానికి తిండి లేదు.. అయినా స్వస్థలాలకు చేరాలన్న ఆతృత ఆగనీయడం లేదు. ప్రభుత్వాలను కాదు.. కష్టం చేసిన కాళ్లను నమ్ముకున్నారు. విరామమెరుగక సాగుతున్నారు. లాక్‌డౌన్‌ వేళ ప్రధాన చర్చనీయాంశమైన వలస కూలీల పట్ల పాలకులు ఏమీ చెప్పినా ఆచరణలో ఏ మాత్రం అమలు కాలేదన్నది కూలీల కాలి నడక సాక్షిగా రుజువైంది. వలస కూలీల తరలింపుకు ప్రత్యేక చర్యలు అం టూ చేసిన ప్రకటనలు, పతాక శీర్షికలు బ్రేకింగ్‌ న్యూస్‌ అయ్యాయి తప్ప.. కూలీలకు వనగురింది ఏమీ లేదన్నది వాస్తవం. ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం అన్నింటికి మించి కరోనా నేపథ్యంలో తమ స్వస్థలాలకు చేరాలన్న కోరిక వలస కూలీలను ఇబ్బందులకు గురి చేస్తుం ది. వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుని జీవనం గడుపుతున్న వీరందరూ తిరిగి ప్రయాణమయ్యారు. అధికారులు వివరాలు సేకరించి వారాలు గడుస్తున్నా స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో కాలి నడకన బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూలీ పనులు చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని బాలాఘట్‌ జిల్లానుంచి వచ్చారు. వ్యవసాయ పనులతో సహా వివిధ రకాలుగా పనిచేసి జీవితం గడుపుతున్న వీరిని కరోనా ఒక కుదుపుకు గురి చేసింది. చేసేందుకు పనిలేక నానా ఇబ్బందులు పడ్డ వీరు చివరకు స్వస్థలాలకు కూడా చేరే మార్గం కరువైంది. లాక్‌డౌన్‌ ప్రారంభం నుండి అనేక అర్జీలు పెట్టుకున్నా అధికారుల నుండి సరైన స్పందన రాకపోవడం శోచనీయం. చివరకు భద్రాచలం, కొత్తగూడెం మీదుగా ప్రధాన రహదారి వెంట నడుచుకుంటూ గురువారం ఖమ్మం నగరానికి చేరుకున్నారు. నెత్తిన సామాన్ల మూటలు, సంకలో పిల్లలు, నిండుగా ధరించేందుకు కూడా బట్టలు సరిగా లేని వీరు రోడ్లవెంట నడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చుతున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో బాలఘట్‌ జిల్లాలోని పల్లెలకు వెళ్లాలని వారు చెబుతుంటే కళ్ల వెంట కన్నీరు ఒలుకుతున్నాయి. ఖమ్మం నుంచి బాలఘట్‌ 645 కిలో మీటర్ల దూరం ఉంది. వీరి బాధను చూడలేని వారు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థికంగా సహాయమందిస్తున్నారు. రెండు రకాల ఇబ్బందులు తలెత్తున్నాయి. వలస కూలీల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించి స్వస్థలాలకు చేర్చాలనే డిమాండ్‌తో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. బాధ్యతతో కాకపోయినా మానవతా ధృక్పథంతోనైనా పాలకులు వ్యవహరించాలని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?