కాళేశ్వరం పనులు భేష్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఒక అద్భుతమైన వరమణి “15వ ఆర్థిక సంఘం సభ్యులు అశోక్‌ లహరి, రీతా లహరీలు అన్నారు. కాళేశ్వరంలో భాగంగా ఎల్లంపల్లి నుండి మేడారం రిజర్వాయర్‌ కు నీటిని తరలించేందకు ప్యాకేజి 6 కింద నిర్మిస్తున్న అండర్‌ టన్నెల్‌ పనులను ఆదివారం 15వ ఆర్థిక సంఘం సభ్యులు పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం తన సిఫార్సులను, నివేదికను తయారు చేయడానికి రాష్ట్రాలను పర్యటిస్తున్న నేపథ్యంలో ఆదివారం రాష్ట్రంలో పర్యటించారు. హైదరాబాద్‌ చేరుకున్న బృంద సభ్యులు కాళేశ్వరం ప్రాజేక్టులోని భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డలో బ్యారేజిని పరిశీలించారు. అనంతరం జిల్లాలో ధర్మారం మండలం నందిమేడారం వద్ద నిర్మీస్తున్న ప్యాకేజి 6 పనులను వారు పరిశీలించడానికి వచ్చిన బృందానికి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన స్వాగతం పలికారు. గోదావరి నదిలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల నుండి ప్రతి రోజు 2 టిఎంసిల నీరు ఎత్తిపోసి 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ మొత్తం సుమారు 36 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందకు, హైదరాబాద్‌ నగర త్రాగు నీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు మరియు నీరు ప్రవహించే వేలాది గ్రామాల తాగునీటి అవసరాలను సైతం తీర్చే బృహత్తర పథకం కాళేశ్వరమని అధికారులు ఆర్థిక సంఘ సభ్యులకు వివరించారు. కాళేశ్వరం ప్రాజేక్టులో భాగంగా రూ.5046 కోట్ల వ్యయంతో ప్యాకేజి -6 పనులను ప్రారంభించి 95 శాతం మేరకు పనులు పూర్తి చేసామని, జూన్‌ నాటికి నూరు శాతం పూర్తి చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్యాకేజి -6లో భాగంగా అప్రోచ్‌ చానల్‌ ఎక్సకవేషన్‌, గ్రావీటీ కాలువ లైనింగ్‌ పనులు, టన్నెల్‌ లైనింగ్‌, సర్జపూల్‌ పనులు, డ్రాఫ్ట్‌ ట్యూబ్స్‌ పనులు, ట్రాన్స్‌ ఫార్మర్‌ ,డెలివరి చానెళ్ల పనులు పూర్తి చేసామని, పంప్‌ హౌజ్‌ పనుల్లో భాగంగా ఎక్సకేవేషన్‌ పనులు పూర్తి చేసామని, కాంక్రీట్‌ పనులు వేగంగా సాగుసతున్నాయని, ప్రతి రోజు 2 టీఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన 7 పంపులకు గాను 4 పంపుల బిగింపు ప్రక్రియ పూర్తి చేసి డ్రై రన్‌ ను విజయవంతంగా నిర్వ హించామని, మిగిలిన 3 పంపులను సైతం త్వరలో బిగించీ ఏప్రిల్‌ మాసం చివరి వరకు వెట్‌ రన్‌ నిర్వహించేందకు సన్నహలు చేస్తున్నామని, జూన్‌ మాసం నాటికి పనులన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందించడమే లక్ష్యంగా 3 షిప్టల్లో 24 గంటలు పనులు సాగుతున్నాయని అధికారులు వివరించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2 టీఎంసిలకు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన ఎలక్ట్రో మెకానికల్‌ పనులు, 3 టీఎంసిలను తరలించడానికి అవసరమైన సివిల్‌ పనులు చేస్తున్నామని అధికారులు వివరించారు. అనంతరం ఎల్లంపల్లి నుండి మిడ్‌ మానేర్‌ జలాశయం వరకు నీటిని తరలించే లింక్‌ 2 పనుల పురోగతిని సైతం 15వ ఆర్థిక సంఘం సభ్యులకు సంబంధిత అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజేక్టు రుపొందించామని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇప్పటి వరకు ప్యాకేజి- 6 లో భాగంగా కాలువల్లో 10,63,117 క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, అండర్‌ గ్రౌండ్‌ టన్నెలో 12,91,754 క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 6,44,485 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రిట్‌ పని 2 సీఎం/సీడి పనులు, 4 పంపుల బిగింపు పనులు పూర్తి చేసామని అధికారులు వివరించారు. ప్రాజేక్టు పనులను నిశితంగా పరిశీలించిన ఆర్థిక సంఘం బృంద సభ్యులు, దేశంలోనే భారీ నీటిపారుదల ప్రాజేక్టును అతి తక్కువ సమయంలోవ తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, సాగునీటికి అత్యుత్తమ ప్రధాన్యత కల్పిస్తు అద్భుతమైన డిజైన్‌ తో సాగునీటిరంగంతో పాటు మత్స్య పరిశ్రమ, టూరిజం సైతం పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని 15వ ఆర్థిక సంఘం సభ్యులు ప్రశంసించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను ఆర్థిక సంఘం సభ్యులు పరిశీలించారు.

DO YOU LIKE THIS ARTICLE?