కార్మిక శాఖ అధికారిదారుణహత్య

ప్రజాపక్షం/ ఖమ్మం క్రైం/జయశంకర్‌ భూపాలపల్లి ప్రతినిధి
ఈ నెల 7న హన్మకొండలో అపహరణకు గురైన ఖమ్మం జిల్లా కార్మిక శాఖ సహాయ అధికారి ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఆనంద్‌రెడ్డి పోలీసుల దర్యాప్తులో హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. ఈ విషయమై హన్మకొండలో కేసు నమోదైంది. ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూడడంతో కుటుంబ సభ్యులు, కార్మిక శాఖాధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన ఆనంద్‌రెడ్డి గత సంవత్సర కాలంగా ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6న ఖమ్మంలో విధులు నిర్వహించుకుని ఆనంద్‌రెడ్డి తిరిగి హన్మకొండలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. 7వ తేదీ ఉదయం భూపాలపల్లికి వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపిన ఆయన తిరిగి రాకపోగా ఆనంద్‌రెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఈనెల 8న హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన అనంతరం హత్యకు గురికావడంతో ఈ హత్యకు కారణం వెనక ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రదీప్‌రెడ్డి అనే వ్యాపారికి ఆనంద్‌కు మధ్య ఆర్థిక వ్యవహారాలు ఉండడంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రదీప్‌రెడ్డి ఆనంద్‌రెడ్డికి రూ. 80 లక్షలు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఇస్తానని చెప్పి ఈనెల 7న అతను భూపాలపల్లికి రమ్మనట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ మరికొందరితో కలిసి గోళ్లబుద్దారం అటవీ ప్రాంతంలో ఆనంద్‌రెడ్డిని హత్య చేసి అక్కడి నుంచి వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. అనంతరం ఆనంద్‌రెడ్డి కారులో హైదరాబాద్‌ వెళ్లి కారును శుభ్రం చేయించి అల్వాల్‌ ప్రాంతంలోని ప్రదీప్‌రెడ్డి స్నేహితుడి ఇంటి పక్కన కారును పార్కు చేసి అక్కడి నుంచి ప్రదీప్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో హన్మకొండ పోలీసులు కాల్‌ డేటా ద్వారా దర్యాప్తు జరిపి ప్రదీప్‌రెడ్డిపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో ఆనంద్‌రెడ్డి హత్య వెలుగు చూసింది. మంగళవారం రాత్రి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు హన్మకొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?