కార్మికులు, పేదల పట్ల అలక్ష్యం

కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా 19న సిపిఐ నిరసన

ప్రజాపక్షం/న్యూఢిల్లీ: వలస కార్మికులు, పేదల పట్ల కేంద్రంలోని మోడీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఐ విమర్శించింది. వలస కార్మికుల సాధకబాధకాలను పరిష్కరించే చర్యలను డిమాండ్‌ చేస్తూ ఈనెల 19వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. “వేలాదిమంది వలస కార్మికులు జీవనోపాధులు కోల్పోయి, ఆహారం లేక, స్వస్థలాలకు చేరుకునేందుకు చేతిలో డబ్బులేక, కుటుంబాలను పోషించుకోలేక కనీవినీ ఎరుగని కష్టాలనుభవిస్తున్నారు. వారి దయనీయ స్థితిని, కడగండ్లను ప్రభు త్వం పట్టించుకోవటం లేదు. ప్రధానమంత్రి ప్రకటించిన రు.20లక్షల కోట్ల ప్యాకేజీ, దానిపై ఆర్థికమంత్రి ఇస్తున్న వివరాలు రాజకీయ వాగాడంబరం మాత్రమే. కొవిడ్‌ మహమ్మారి కలుగజేసిన ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటిలో చెప్పుకోదగింది ఏమీలేదు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకరమైన నయా ఉదార విధానాల వల్ల జబ్బుపడిన ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి కొవిడ్‌ తోడయింది. తాము నిస్సహాయులమనే భావనతో ప్రజలు నిరాశ నిస్పృహలో పడిపోవటాన్ని అనుమతించకూడదు. అందువల్ల సిపిఐ జోక్యం చేసుకుని కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలి. పార్టీ సంయుక్త ప్రచారాందోళనల్లో పాల్గొంటూనే, స్వతంత్రంగా కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి తక్షణ జోక్యాన్ని, ప్రతిస్పందనను డిమాండ్‌ చేస్తున్నది” అని సిపిఐ ఆ ప్రకటనలో పేర్కొంది. వలస కార్మికుల కోసం మరిన్ని రైళ్లు, బస్సులు నడపాలని, వారికి ఆహారం, త్రాగునీరు అందించాలని డిమాండ్‌ చేసింది. ప్రయా ణభత్యం కింద ప్రతి కార్మికునికీ రూ.10,000 ఇవ్వాలని, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చవద్దని, ఈ పథకం కింద ప్రతి కుటుంబంలోని వయోజనులకు పనిదినాలు పెంచాలని, సకాలంలో డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. అలాగే, పట్టణ ఉపాధి, ఆశ్రయాన్ని గ్యారంటీ చేయాలని, రేషన్‌కు షరతులుండకూడదని, కార్మిక చట్టాలను దిగజార్చవద్దని కోరింది. గ్రామీణ పేదల, చిన్న,సన్నకారు రైతుల సమస్యలను తగినంతగా పరిష్కరించాలని, వృద్ధులు, విధవలు, దివ్యాంగులు తదితరులకు పెన్షన్‌ పెంపుదల చేయాలను, ఇతర సామాజిక భద్రత చర్యలు చేబట్టాలని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనకు పిలుపు ఇవ్వాలని పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. వలస కార్మికుల సాధక బాధకాలను పరిష్కరించే చర్యలను డిమాండ్‌ చేస్తూ 19 మే 2020న ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలని సిపిఐ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నచోట్ల నల్ల బ్యాడ్జీలు ధరించాలని, నల్లజెండాలు చేబూనాలని, ఇతర చోట్ల కార్మికశాఖ కార్యాలయాలు లేదా రెవెన్యూ కార్యాలయాలముందు నిరసన తెలియజేయాలని పార్టీ యూనిట్లకు, సభ్యులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా భౌతిక దూరం పాటించటం, ముఖానికి మాస్క్‌లు ధరించటం వంటి నియమాలను పాటించాలని సూచించింది.

DO YOU LIKE THIS ARTICLE?