కార్డులున్నా.. లేకున్నా.. అందరికీ సరుకులు

ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్న
ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఒకటి కారు రెండు కాదు ఏకంగా 8 లక్షల తెల్ల రేషన్‌ కార్డులను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకునే ముందు అధికారులు ఒక్కసారి ఆలోచన చేసుంటే బాగుండేదని హైకోర్ట్‌ అభిప్రాయపడింది. అసలే కరోనా కష్టాలు, లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు రేషన్‌కార్డు లేదని చెప్పి నిత్యావసర వస్తువులను ఇవ్వబోమంటే ఎలాగని ప్రశ్నించింది. పేదల పాట్లు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయాలని హితవు చెప్పింది. లాక్‌డౌన్‌ వేళ కార్డులు ఉన్నా లేకపోయినా అందరికీ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో బయోమెట్రిక్‌ కోసం జనాన్ని ఇబ్బందులకు గురిచేయవద్దని, వేలిముద్రలు నమూనాలు తీసుకోకుండానే సరుకులు ఇవ్వాలని ఆదేశించింది. సామాజిక కార్యకర్త ఎస్‌క్యూ మసూద్‌ వేసిన పిల్‌లో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ల బెంచ్‌ పైవిధంగా ఆదేశాలు ఇచ్చింది, కార్డుదారులకు వాదనలు తెలుసుకునేందుకు నోటీసు ఇచ్చిన తర్వాత అవసరమైతే కార్డుల్ని రద్దు చేయాలని, లేకపోతే సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం అవుతుందని అభిప్రాయపడింది. లాక్‌డౌన్‌లో మూడు విడతలుగా బియ్యం తీసుకోనోళ్లకు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం చేయకూడదనే నిర్ణయాన్ని బెంచ్‌ తప్పుపట్టింది. బియ్యం తీసుకున్నా తీసుకోకున్నా కూడా జిఒ 45 కింద లాక్‌డౌన్‌లో తెల్లకార్డుదారులకు రూ.1500 నగదు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సృజన అనే హైదరాబాదీ రాసిన లేఖను పిల్‌గా తీసుకున్న హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. కార్డు ఉన్నా లేకుండా వ్యక్తికి 12 కిలోల బియ్యం ప్రభుత్వం ఇస్తోందని ఎజి చెప్పారు. వివరాల కోసం విచారణ జూన్‌ 2కి వాయిదా పడింది.

DO YOU LIKE THIS ARTICLE?