కాదు.. కాదంటూనే

మరో వివాదాస్పద బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌
న్యూఢిల్లీ: మోడీ సర్కారు దృష్టిలో ఔనంటే కాద ని, కాదంటే అవునని అర్థాలు ఉన్నట్టు కనిపిస్తోం ది. ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పటికే ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లును శుక్రవారం లోక్‌సభలోప్రవేశపెట్టింది. ఇది వరకు కొన్ని ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ సమయంలో ఉద్యోగులకు ఏమాత్రం నష్టం వాటిల్లదని, వారి ఉద్యోగ భద్రతను, హక్కులను పరిరక్షిస్తామని చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ దిశ గా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, సమాఖ్యలు నిరసనలు వ్యక్తం చేసినా, ఆందోళనలు, బంద్‌లు కొనసాగించినా ఫలితం లేకపోయింది. తాజాగా జనరల్‌ ఇన్యూరెన్స్‌ (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నిర్మల తలుపులు బార్లా తెరిచారు. సాధారణ బీమా రంగాన్ని ప్రైవేటీకరించడం తమ అభిమతం కాదని అంటూనే, బీమా కంపెనీల్లో ప్రభుత్వ వాటాను తగ్గించుకోవడం లేదా ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించే సవరణలను ప్రతిపాదించడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ ప్రతిపాదనలను గతంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీముక్తకంఠంతో ఖండించాయి. బీమా రంగాన్ని పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించాయి. అయితే, నిర్మల మాత్రం ప్రైవేటీకరణ తమ ఉద్దేశం కాదని లోక్‌సభలో బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ‘సభ్యుల అభ్యంతారాలను గమనించాను. కానీ, ఈ బిల్లు ద్వారా బీమా రంగాన్ని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. దీని ద్వారా, ప్రజల సౌకర్యార్థం విస్తారమైన సేవలు, పథకాలు అమలు చేసేందుకు వీలు కలుగుతుంది. సాధారణ బీమా రంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నాం’ అన్నారు. జనరల్‌ ఇన్సూరెన్స్‌లో ప్రభుత్వ వాటా కనీసం 51 శాతం ఉండాలన్న నిబంధనను తొలగించేందుకు ఈ సవరణను ప్రతిపాదించామని ఆమె వివరించారు. ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించుకుంటుందని నిర్మల తన సమాధానం ద్వారా చెప్పకనే చెప్పారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేది లేదని గతంలో పలుమార్లు ప్రకటించిన ఆమె, అందుకు భిన్నంగా బడ్జెట్‌ ప్రసగంలో ఎన్నో ప్రతిపాదనలు చేశారు. అవి ఇప్పుడు బిల్లుల రూపంలో పార్లమెంటులో దర్శనమిస్తున్నాయి. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులకు ఆమోదం పొందడమే ఆనవాయితీగా పెట్టుకున్న మోడీ సర్కారు ఈ బిల్లును కూడా చట్టరూపంలోకి తీసుకురావడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే జరిగితే, ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్న రీతిలో బీమా రంగం దశల వారీగా ప్రైవేటు చేతుల్లోకి వెళుతుంది. సామాన్యుడికి అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి. ప్రభుత్వ రంగంలో ప్రస్తుతంనేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఉన్నాయి. వీటి నుంచి భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే సవరణ బిల్లును ప్రతిపాదించింది.

 

DO YOU LIKE THIS ARTICLE?