కాటేస్తోంది!

ఒక్కరోజే అనూహ్యంగా 730 కరోనా కేసులు
గ్రేటర్‌లోనే 659 కొవిడ్‌ -19 పాజిటివ్‌లు
జనగామ జిల్లాను వణికిస్తున్న మహమ్మారి
ప్రజాపక్షం/హైదరాబాద్‌  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విషం గక్కుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో రోజురోజుకీ విజృంభిస్తోంది. ఆదివారం ఊహించని రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదై జనాన్ని భయపెడుతోంది. ఈసారి ఒక్కరోజే ఏకంగా 730 కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో కొత్త రికార్డు. కేసులు ఎనిమిదివేలకు చేరువవుతున్నాయి. కొత్తగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 210కి చేరింది. ఆదివారం నమోదైన 730 కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలోనే 659 పాజిటివ్‌లను గుర్తించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కాకుండా దాన్ని ఆనుకొని వున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా 9 కేసులు నమోదు అయ్యాయి. ఈసారి జనగామ జిల్లాను కరోనా కాటేసింది. ఆ జిల్లాలో ఒకే రోజు ఏకంగా 34 కేసులు నమోదయ్యాయి. జిల్లా అధికారులు ఉలిక్కిపడ్డారు. కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ఇవి కాకుండా, వరంగల్‌ అర్బన్‌లో 6 కేసు లు, ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు కేసులు, వికారాబాద్‌ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్‌, బద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, మెదక్‌, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కొ క్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,802కి  పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 3,861 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 3,731 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారంనాడు 225 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 3,297 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, అందులో 2,567 శాంపిల్స్‌ నెగిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు మొత్తం 57,054 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

DO YOU LIKE THIS ARTICLE?