కాంగ్రెస్‌ ఎంపిలపై సస్పెన్షన్‌ వేటు

ఈ పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేంత వరకు ఏడుగురు సభ్యుల సస్పెన్షన్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో గురువారం ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులపై వేటుపడింది. సభ్యులు పేపర్లను చింపి స్పీకర్‌ విసరడంతో సభ నిబంధనలను ఉల్లంఘించారని, అనైతికంగా వ్యవహరించారంటూ ప్రస్తుత సెషన్‌లో మిగిలిన పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేంత వరకు వారిని సస్పెండ్‌ చేశారు. సభ మధ్యాహ్నం 3 గంటలకు వరకు వాయిదా పడి న తరువాత తిరిగి ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ సభ్యులు గౌరవ్‌ గగోయ్‌, టిఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కుర్యాకోస్‌, మణికా ఠాగూర్‌, రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌, బెన్నీ బెహనాన్‌, గుర్జీద్‌సింగ్‌ హౌజ్లాను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న ప్రిసైడింగ్‌ అధికారి మీనాక్షి లేఖి ప్రకటించారు. స్పీకర్‌ ఒకసారి సభ్యుడిని సస్పెండ్‌ చేస్తే ఆ సభ్యుడు సభకు హాజరు కాకూడదు. కాగా, సభలో ఖనిజాల చట్ట సవరణ బిల్లు 2020పై చర్చ జరుగుతుండగా కొంత మంది సభ్యులు స్పీకర్‌ పోడియం నుంచి బలవంతంగా పేపర్లను లాక్కొని వాటిని విసిరివేసినట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న మీనాక్షి లేఖి పేర్కొన్నారు. పార్లమెంట్‌ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం మొదటిసారి అని, ఇది చాలా దురదృష్టకరమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి ప్రహ్లాజ్‌ జోషి ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులను ప్రస్తుత సెజన్‌ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య మూజివాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించారు. స్పీకర్‌ అధికారాలను, సభ నిబంధనలను, కాంగ్రెస్‌ సభ్యులు ఉల్లంఘించారని, అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిని సమావేశాల నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారన్నారు. సస్పెన్షన్‌ అనంతరం తక్షణమే లోక్‌సభ చాంబర్లను వదిలి వెళ్లాలని ఆ ఏడుగురు సభ్యులను లేఖీ ఆదేశించారు. ఆ తరువాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు. సభ్యుల సస్పెన్షన్‌ సమయంలో ప్రతిపక్ష పార్టీల సభ్యులందరు కూడా వెల్‌లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, గురువారం లోక్‌సభ నాలుగుసార్లు వాయిదా పడింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వివాదాస్పద చేసిన రాజస్థాన్‌ ఎంపిని సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేయడంతో సభ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో సభ వాయిదా పడుతూ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి బిజెపి మద్దతు ఉన్న రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ సభ్యుడు హనుమాన్‌ బెనివాల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశారు. ఆ సమయంలో స్పీకర్‌ స్థానంలో ఉన్న రమా దేవి సభా కార్యక్రమాలను నడిపించారు. అయితే రాజస్థాన్‌ ఎంపిని సస్పెండ్‌ చేయాలని, మోడీ సర్కార్‌ సిగ్గు సిగ్గు అంటూ కాంగ్రెస్‌ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాగా, ఖనిజ లవణాల చట్ట సవరణ బిల్లు 2020 ఆమోద దశలో ఉండగా కాంగ్రెస్‌ సభ్యుడు గౌరవ్‌ గగోయ్‌ పేపర్లను చింపి లోక్‌సభ స్పీకర్‌ పోడియంపై విసరడం కనిపించింది. దీంతో సభను రమాదేవి సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.

DO YOU LIKE THIS ARTICLE?