కాంగ్రెస్‌కు సింధియా గుడ్‌ బై

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించారు. ఆయన రాజీనామా మంగళవారం మధ్యాహ్నం 12.20 సోనియా గాంధీ కార్యాలయానికి చేరింది. ఆయన బిజెపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన 17 మంది ఎంఎల్‌ఎలు రాజీనామా చేసిన మరునాడే(మంగళవారం) ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. ‘నేను 18ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీలో ప్రాథమిక సభ్యుడిగా పనిచేశాను. ఇప్పుడు ఆ పార్టీ వీడాల్సిన సమయం ఆసన్నమైంది. నేను ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలన్నదే నా లక్ష్యం. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ నేను ఈ పనిచేయలేకపోతున్నాను. నా ప్రజల, కార్యకర్తల అభిలాష మేరకు నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాను. దేశానికి సేవ చేసేందుకు ఇన్నాళ్లు వేదికనిచ్చిన మీకు, పార్టీ కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు’ అంటూ ఆయన తన రాజీనామాలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 228 సభ్యులున్నారు. ఒకవేళ 17 మంది ఎంఎల్‌ఎల రాజీనామా అంగీకరిస్తే అసెంబ్లీలో బలం 211కు తగ్గుతుంది. అసెంబ్లీలో మెజారిటీ మ్యాజిక్‌ సంఖ్య 106. కాగా కాంగ్రెస్‌ బలం 97 సీట్లకు తగ్గిపోతే, బిజెపి బలం 104కు పెరుగుతుంది. కాంగ్రెస్‌కు నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బిఎస్‌పి, ఒక ఎస్‌పి ఎంఎల్‌ఎ మద్దతు ఉంది. అయితే వారు కాంగ్రెస్‌కు మద్దతు కొనసాగిస్తారా లేదా అన్నది స్పష్టంగా తెలియడంలేదు. సింధియా రాజీనామా అందిన తర్వాత ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ‘కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ నుంచి బహిష్కరించారు’ అని ప్రకటించారు. సింధియా గ్వాలియర్‌ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అన్నది ఇక్కడ గమనార్హం.

DO YOU LIKE THIS ARTICLE?