కల్పనను కూడా.. చంపేశాడు

మరో బావిలో పడేశాడు.. అస్థిపంజరం లభ్యం
2015లో జరిగిన ఘటన
మనీషా, శ్రావణి, కల్పన కేసుల్లో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి రిమాండ్‌
కఠిన శిక్ష పడేలా చూస్తాం: కమిషనర్‌ మహేష్‌ భగవత్‌
ఊరోళ్లు కొట్టారనే ఆ గ్రామంపై కక్షతో సైకోగా మారిన కిల్లర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: అందరు ఊహించినట్లుగానే శ్రావణి, మనీషాలను అత్యాచారం, హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం బంధువుల ఇంటికి వచ్చి అదృశ్యమైన కల్పన (11)అనే విద్యార్థినిపై కూడా అఘాయిత్యానికి ఒడిగట్టి చంపేశాడు. అయితే ఆమె మృతదేహాన్ని శ్రావణి, మనీషా మృతదేహాలను పడేసిన బావిలో కాకుండా సీతారాంరెడ్డి బావిలో పడేశాడు. కల్పన శవం కోసం మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు గాలిం పు చర్యలు చేపట్టగా కల్పన అస్థిపంజరం లభ్యమైంది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌ పరిధిలో డిగ్రీ విద్యార్థిని మనీషా (19), పదో తరగతి విద్యార్థిని శ్రావణి (15), ఆరో తరగతి విద్యార్థిని కల్పన (11) ఈ ముగ్గురిపై అత్యాచారం జరిపి, ఆ తరువాత హత్య చేసి శవాలను బావిలో పడేసిన నిందితుడు హాజిపూర్‌కు చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్‌ హన్మంతు (28)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డి పాల్పడిన హత్యల పరంపరను వివరించాడు.
ఊరోళ్లు కొట్టారనే కక్షతో సైకోగా మారాడు… యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజిపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి (28) లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 2015లో పక్క గ్రామమైన మైసిరెడ్డిగూడెం గ్రా మంలో వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న ఓ యువతిని ఈవ్‌టీజింగ్‌ చేశాడు. దీనిపై బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే సమయం లో గ్రామస్తులు శ్రీనివాస్‌రెడ్డిని పట్టుకుని దేహశుద్ది చేశారు. అందరు తనను కొట్టడంతో అతను సైకోగా మారి పగ తీర్చుకోవాలనే కక్షను పెంచుకున్నాడు. అదే ఏడాది హాజిపూర్‌లోని బంధువుల ఇంటికి వచ్చిన కల్పన (11)ను బైక్‌పై తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడి సీతరాంరెడ్డి బావిలో పడేశాడు. కల్పన ఏమైందో నిన్నటి వరకు కూడా ఎవరికి తెలియదు. ఇదిలావుండగా మార్చి 9న హాజీపూర్‌కు చెందిన మనీషా (18) కళాశాలకు వెళ్తుండగా బైక్‌పై లిఫ్ట్‌ పేరుతో ఎక్కించుకున్నాడు. హిజిపూర్‌ బావి వద్దకు రాగానే ఆమె ముక్కు, నోరు మూసి బావిలో పడేశాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు. అదే బావిలో పాతిపెట్టాడు. మనీషా తన ప్రియుడితో వెళ్లిపోయి ఉంటు ందని తల్లిదండ్రులు కనీసం మిస్సింగ్‌ కేసు కూడా పెట్టలేదు. ఇక ఎప్రిల్‌ 25న ఇదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని శ్రావణి (14) స్పెషల్‌ క్లాస్‌కని స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌పై లిఫ్ట్‌ ఇస్తానని ఎక్కించుకుని హాజీపూర్‌ బావి వద్దకు రాగానే మనీషాను చేసినట్లుగానే చంపేసి అదే బావిలో పాతిపెట్టాడు. ఊర్లో ఎవరికి అనుమానం రాకుండా అందరి ముందే తిరుగుతున్నా డు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రావణి హత్యకు గురైందని తేలింది.

DO YOU LIKE THIS ARTICLE?