కల్తీ మద్యం సేవించి 34 మంది బలి

ఉత్తరాఖండ్‌లో విషాదకరఘటన
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
17 మంది అధికారులు సస్పెన్షన్‌

డెహ్రాడూన్‌ : కల్తీ మద్యం 34 మంది సామాన్యులను బలిగొన్నది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌ జిల్లాలో గల ఓ గ్రామంలో శుక్రవారంనాడు కల్తీ మద్యం సేవించి 34 మంది మృతిచెందారు. దీనిపై జిల్లా పాలనాయంత్రాంగం మేజిస్టీరియల్‌ దర్యాప్తుకు ఆదేశించిం ది. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన 17 మంది ఎక్సైజ్‌, పోలీసు అధికారులను కూడా సస్పెండ్‌ చేసింది. రూర్కీకి సమీపంలోని ఝబ్రేరాలో గల బాలాపూర్‌ గ్రామంలో ఒక వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా అతని బంధువులు, మిత్రులు మద్యం సేవించారని, అయితే అది పూర్తిగా కల్తీ మద్యమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఎడిజి (శాంతిభద్రతలు) అశోక్‌కుమార్‌ తెలిపారు. కల్తీ మద్యం సేవించిన వెంటనే అస్వస్థతకు గురైన 34 మందిలో 14 మంది అక్కడికక్కడే మరణించగా, మిగిలినవారు ఆసుపత్రులు, వారి స్వంత నివాసాలకు వెళ్లిన తర్వాత ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. షహరాన్‌పూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తులు అంత్యక్రియలు కార్యక్రమం ముగిసిన వెంటనే ఇంటికి వచ్చాక మరణించారని, మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు తెలిపారు. రూర్కీలోని ఒక ఆసుపత్రిలో మరో నలుగురు వ్యక్తులు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు. రాత్రిపూట మద్యం సేవించిన తర్వాత ఉదయం నుంచి మరణాలు సంభవించాయని ఎడిజి వివరించారు. ఈ కార్యక్రమంలో కనీసం 32 మంది కల్తీ మద్యం సేవించినట్లు స్థానికులు చెపుతున్నారు. అందుకే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలిపారు. ఈ ఘటనపై మేజిస్టీరియల్‌ దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి 13 మంది అధికారులను హరిద్వార్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ దీపక్‌రావత్‌ సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన 13 మంది ఎక్సైజ్‌ పోలీస్‌ అధికారులే. కాగా, మరో నలుగురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్‌ చేసినట్లు ఉత్తరాఖండ్‌ డిజిపి అనిల్‌ రాటూరి తెలిపారు. సస్పెండ్‌ అయిన పోలీస్‌ అధికారుల్లో ఝాబ్రేరా పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ప్రదీప్‌ మిశ్రా కూడా వున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?