కరోనా సహాయక చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

కెసిఆర్‌ ప్రతిపక్షాలను తిట్టడం మీద పెట్టిన శ్రద్ధ పాలన మీద లేదు
వైన్‌షాపులు తెరిచేందుకు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు
ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందించాలి
‘రైతు సంక్షేమ దీక్ష’లో టిపిసిసి అధ్యక్షులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్రతిపక్షాలను తిట్టడం మీద పెట్టిన శ్రద్ధ పాలన మీద పెట్టడం లేదని టిపిసిసి అధ్యక్షులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కరోనా సహాయక చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వైన్‌షాపులు తెరిచేందుకు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. వలస కార్మికుల ఎంత మందో ప్రభుత్వం వద్ద లెక్కలు లేనే లేవని, వారి కోసం ప్రారంభించామని చెబుతున్న 400 అన్నపూర్ణ క్యాంటీన్‌ల వివరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని, వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు నష్టం కలిగించొద్దని కోరుతూ టిపిసిసి ఆధ్వర్యంలో మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు సంక్షేమ దీక్ష’ జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో డిసిసి అధ్యక్షులు, నియోజక వర్గ నాయకులు, ముఖ్య నాయకులు దీక్షలు నిర్వహించారు. గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌, ఎ.రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి మాజీ నేత కె.జానారెడ్డి, ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి, మాజీ ఎంపిలు వి.హనుమంత రావు, పొన్నం ప్రభాకర్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టిపిసిసి కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్ర శేఖర్‌, మాజీ ఎంఎల్‌సి రాములునాయక్‌, నాయకులు బెల్లయ్యనాయక్‌, దాసోజు శ్రవణ్‌, మేడిపల్లి సత్యం తదితరులు దీక్షలో పాల్గొన్నారు. పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్‌, మాజీ ఎంపి మల్లు రవి తదితరులు వారి ఇళ్లల్లో దీక్షలు చేశారు. గాంధీభవన్‌లో దీక్ష సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పిఎం కేర్స్‌, ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో కోట్లు వసూలు చేస్తున్నారని, అలాంటిది వలస కార్మికులకు ఉచిత ప్రయాణసౌకర్యం కల్పించకపోవడం దుర్మార్గమన్నా రు. ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోలేనందునే తాము తీసుకున్నామన్నారు. వలస కార్మికులు వెళ్లకుండా ఇక్క డే ఉండేందుకు సౌకర్యాలు కల్పించాలని, లేదంటే నిర్మాణరంగం కుంటుపడుతుందన్నారు. బస్తాలు, పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఆ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వైన్‌షాప్‌లు తెరిచే విషయంలో అత్యుత్సాహం వద్దన్నారు. లాక్‌డౌన్‌లో పేదలకు సహా యం రూ.5వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభు త్వం ఇచ్చే రేషన్‌ బియ్యా న్ని 80శాతం ప్రజలు తినడం లేదని విమర్శించారు. విపత్కర పరిస్థితుల్లో పేదలు తినడానికి సన్నబియ్యం ఇస్తే బాగుండేదన్నారు. బత్తాయి రైతుల అవస్థలకు సిఎం వైఖరే కారణమని, వాటిని ప్రభుత్వమే కొనాలన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ కొవిడ్‌ టెస్టులు జరుగుతున్నది మన రాష్ట్రంలోనేనని, ఐసిఎంఆర్‌ అప్రూవ్డ్‌ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో టెస్టులకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చనిపోయిన వారికి కరోనా టెస్టులు చేయొద్దనడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?