కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి ప్రజలందరూ సహకరించాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
హైదరాబాద్‌ : మహమ్మారి కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి ప్రజలందరూ సహకరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా కంటికి కనపడని శత్రువును ఎదుర్కోడానికి అందరూ సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి మొదటి తేదీ నుండే విదేశాల నుండి వచ్చే క్వారంటైన్‌ చేసి ఉంటే ఇంత ప్రమాదం వచ్చి ఉండేది కాదని చెప్పారు. ప్రజలు కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని, స్వీయ నియంత్రణ తోనే కరోనాను అరికట్టగలమని అన్నారు. కరోనా సునామి కంటే భయంకరమైనదని కొద్దిగా కష్టం అయినా ప్రజలు ఇంటికే పరిమితం కావాలని కోరారు. కరోనా కట్టడికి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌ స్టాఫ్‌, పోలీసులు, అధికారులు, జిహెచ్‌ఎంసి, మున్సిపల్‌ స్టాఫ్‌ అందరికీ సిపిఐ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడికి పనిచేస్తున్న అందరి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దినసరి సరుకులు, కూరగాయాలు తదితర వస్తువుల ధరలు పెరగ కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇటలీ పరిస్థితులు మన దేశంలో రాకుండా అవసరమైతే లాక్‌ డౌన్‌ మరికొన్ని రోజులు పొడిగించాలని చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?