కరోనా విజృంభణ

న్యూఢిల్లీ : చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆదివారం మొత్తం 107 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఢిల్లీ, కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లో 11, కర్నాటకలో 6, మహారాష్ట్రలో 31, లఢక్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 2 కేసులు రికార్డు అయ్యారు. అదే విధంగా తెలంగాణలో మూడు, రాజస్థాన్‌లో రెండు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కేరళలో గత నెలలో డిశ్చార్చ్‌ అయిన వారిని కలుపుకొని 22 కేసులు నమోదయ్యా యి. ఇక హర్యానాలో 14 కేసులు ధ్రువీకరించగా వారంతా విదేశీయులే. కరోనా సోకిన 17 మంది వీదేశీల్లో 16 మంది ఇటీలికి చెందిన వారు, ఒకరు కెనడాకు చెందిన వారు ఉన్నట్లు మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి భారత్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటిచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వైరస్‌ కట్టడి చేపట్టాల్సిన అన్ని ప్రత్యామ్నాయాల్నీ సూచించింది. మాస్కులు, శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా ప్రకటించి వాటి తయారీని పెంచాలని సదరు సంస్థలను ఆదేశించింది. ఇక ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 12,29,363 మందిని స్క్రీన్‌ చేశారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) కొవిడ్‌ మహమ్మారిగా ప్రకటించగా, కరోనా పాజిటివ్‌ అని తేలిన 93 మందితో సన్నిహితంగా మెలిగిన 4వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేంద్ర జాతీయ విపత్తుగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. విద్యాసంస్థలు, దుకాణసముదాయాలు, థియేటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. మరోవైపు ఇటలీ నుంచి భారత్‌కు చేరుకున్న 218 మందిని ఢిల్లీ సమీపంలోని ఐటిబిపి స్థావరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలించారు. వారిని 14 రోజుల పాటు అక్కడే వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. అదే విధంగా ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఎయిరిండియా విమానం ఆదివారం తెల్లవారుజామున ముంబయికి చేరుకుంది. మొత్తం 234 మొత్తం భారతీయులు ఇందులో ఉన్నారు. వీరిలో 131 మంది విద్యార్థులు కాగా.. 103 మంది పర్యాటకులు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు, ఇరాన్‌ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు ఇరాన్‌లో వైరస్‌ బారిన పడి 967 మంది మరణించగా.. మరో 611 మంది బాధితులుగా మారారు. వీరంతా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఉండనున్నారు. 14 రోజుల పాటు వీరిపై వైద్య పర్యవేక్షణ కొనసాగుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?