కరోనా విజృంభణ

24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,611 కేసులు
140 మంది మృతి, భారత్‌లో 1,06,750కి చేరిన బాధితులు

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా రికార్టు స్థాయిలో 5,611 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా 140 మంది మృతి చెందారు. దీంతో బుధవారం ఉదయం నాటికి దేశంలో మొత్తం పాజటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3303 మంది మరణించినట్లు పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. మొత్తం బాధితుల్లో 42,297 మంది కోలుకోగా మరో61,149 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా భారత్‌లో రోజుకు సరాసరి మూడు వేల నుంచి ఐదు వేలకు పైగా కేసులు నిర్ధారణ అవుతుండం ఆందోళన కలిగిస్తోంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండడం కొంత ఊరట కలిగిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా మృతి చెందిన 140 మందిలో మహారాష్ట్రలో 76, గుజరాత్‌లో 25, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లో ఆరుగురు చొప్పున, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో ఐదుగురు చొప్పున, తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ముగ్గురు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌, అసోం, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరేసి చొప్పున, ఒడిశా, పంజాబ్‌లో ఒక్కరేసి చొప్పున మరణించారు.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. తొలి నుంచి రాష్ట్రంలో ఆటు బాధితల సంఖ్య పెరుగుదలలోనూ, మరణాలు సంభవించడంలోనూ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 37,136 కేసులు నమోదు కాగా, 1325 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులు పెరుగుదల సంఖ్యలో తమిళనాడు రెండవ స్థానానికి ఎగబాకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 12,448 కేసులు నమోదు కాగా, 84 మంది మృతి చెందారు. ఇక గుజరాత్‌ మృతుల సంఖ్యలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసులు 12,140 కాగా, 719 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం బాధితుల సంఖ్య 10,554 కాగా, 168 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో 5,845 మంది కరోనా వైరస్‌ బారిన పడగా, 143 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో బాధితుల సంఖ్య 5,465, మృతుల సంఖ్య 254, ఉత్తరద్రేశ్‌లో బాధితుల సంఖ్య 4,926, మృతుల సంఖ్య 123, పశ్చిమ బెంగాల్‌లో బాధితుల సంఖ్య 2,961, మృతుల సంఖ్య 250, ఆంధ్రప్రదేశ్‌లో బాధితుల సంఖ్య 2,532, మృతుల సంఖ్య 52, పంజాబ్‌లో బాధితుల సంఖ్య 2,002, మృతుల సంఖ్య 38, తెలంగాణలో బాధితుల సంఖ్య 1634, మృతుల సంఖ్య 38, బీహార్‌లో బాధితులు 1498, మృతులు 9, కర్నాటకలో 1397 మంది, మృతుల సంఖ్య 40, జమ్మూకశ్మీర్‌లో బాధితులు 1317 ఉండగా, మృతుల సంఖ్య 17, ఒడిశాలో మొత్తం బాధితులు 978 కాగా, మృతుల సంఖ్య 5, హర్యానాలో 964 కేసులు రాగా, 14 మంది మరణించారు. అదే విధంగా కేరళలో మొత్తం 642 మందికి వైరస్‌ సోకగా, జార్ఖండ్‌లో 231 మందికి, చండీగఢ్‌లో 200 మందికి, త్రిపురలో 173, అసోంలో 142, ఉత్తరాఖండ్‌లో 111, ఛత్తీస్‌గఢ్‌లో 101, హిమాచల్‌ ప్రదేశ్‌లో 92, గోవాలో 46 కేసులు, లడఖ్‌లో 43, అండమాన్‌ నికోబార్‌లో 33, పుదుచ్చేరిలో 18, మేఘాలయలో 13, మణిపూర్‌లో 9, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, దాదర్‌ నగర్‌ హవేలీలో ఒక్కో కేసు నమోదైంది.
కరోనా వ్యాప్తి మనదేశంలోనే తక్కువ
మన దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రపంచంలోని మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే లక్ష జనాభాకు 62 మంది కొవిడ్‌ బారిన పడ్డారని, మనదేశంలో లక్ష జనాభాకు 7.9 మంది మాత్రమే కరోనాకు చిక్కారని వెల్లడించారు. ఇక కొవిడ్‌ మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా లక్ష జనాభాకు 4.2 మంది మరణించగా, మనదేశంలో లక్ష జనాభాకు 0.2 మరణాలు మాత్రమే సంభవించాయని ప్రకటించారు. ఇప్పటివరకు 3303 మంది కరోనా సోకి చనిపోయారు. కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. మొదటి లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పుడు రికవరీ రేటు 7.1 శాతం ఉండగా, రెండవ లాక్‌డౌన్‌ సమయంలో రికవరీ రేటు 11.42 శాతం, తర్వాత అది 26.5 9శాతానికి పెరిగి.. ప్రస్తుతం 39.62 శాతానికి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 61,149 కరోనా పాజిటివ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 42,298 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారని లవ్‌ అగర్వాల్‌ ప్రకటించారు.

24గంటల్లో లక్ష కరోనా పరీక్షలు: ఐసిఎంఆర్‌
దేశవ్యాప్తంగా గడచిన 24గంటల్లో 1,08,121 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్‌) వెల్లడించింది. దీంతో బుధవారం నాటికి దేశంలో మొత్తం 25,12,388 కొవిడ్‌- నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. కరోనా వైరస్‌ బాధితులను గుర్తించేందుకు కొవిడ్‌- నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం గత కొంతకాలంగా పెంచుతూ వస్తోంది. ఈ సమయంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఐసిఎంఆర్‌ ఇప్పటికే విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం భారత్‌లో ఆశించినంత మేర కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడంలేదనే విమర్శలూ ఉన్నాయి. ఇదిలా ఉంటే, కరోనా తీవ్రత అధికంగా అమెరికా లాంటి దేశాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటివరకు అమెరికాలో కోటీ ఇరవై లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్న రష్యాలో కూడా ఇప్పటివరకు 75లక్షల పరీక్షలు నిర్వహించారు. ఇక కరోనా వైరస్‌కు కేంద్రస్థానమైన చైనా కూడా భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు ఆర్‌టీ-పీసీఆర్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?