కరోనా పరీక్ష రేటు రూ.2200

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు ధరల నిర్ధారణ
సాధారణ ఐసోలేషన్‌కు రూ. 4వేలు
వెంటిలేటర్‌ చికిత్స రూ. 9వేలు
అమలు చేయకపోతే కఠిన చర్యలు
కరోనాకు ఆరోగ్య శ్రీ వర్తించదు
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉచిత చికిత్స
హైదరాబాద్‌లో ‘కంటైన్‌మెంట్‌’తో నియంత్రణ : మంత్రి ఈటల

ప్రజాపక్షం/హైదరాబాద్‌: పైవేటు ఆస్పత్రుల్లో రూ.2200 ఫీజుతో కరోనా వైరస్‌ పరీక్షలను నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. పాజిటివ్‌ సోకిన వ్యక్తికి సాధారణ ఐసోలేషన్‌కు ప్రతి రోజు రూ.4 వేలు, ఐసియులో వెంటిలేటర్‌ లేని చికిత్సకు రూ.7500, అలాగే వెంటిలేటర్‌పైన ఉన్న వ్యక్తులకు రూ. 9 వేల ఫీజును నిర్ణయించినట్టు తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధిలో కరోన వైరస్‌కు చికిత్స అందించే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మరింత పకడ్బందీగా పరీక్షలను నిర్వహించి, అవసరమైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమార్‌తో కలిసి హైదరాబాద్‌, కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడారు. వెంటిలేటర్‌పైన, ఐసియులో ఉన్న సందర్భంలో ఉపయోగించే యాంటి వైరల్‌ డ్రగ్స్‌ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని, దీనికి ప్రత్యే ఫీజులను వసూలు చేసేలా రూపకల్పన చేశామని, కొన్ని వైరల్‌ ఇన్‌జెక్షన్స్‌కు రూ.40 నుండి రూ. 50వేల వరకు ధరలు ఉన్నాయని, ఈ ఖర్చులను ప్రత్యేకంగా ఛార్జ్‌ చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్టు వివరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే వైరస్‌ పరీక్షలు, చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటిప్పుడు వైద్య ఆరోగ్య శాఖకు తెలియజేయాలని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు సూచించినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతి ఇంటికీ ఆరోగ్య సిబ్బందితో సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత సీజనల్‌ జ్వరాల విషయంలో పగడ్బందీగా సర్వే చేయాలంటే ఆరు లేదా సంవత్సరం వరకు తాత్కాలిక పద్ధతిన ఎఎన్‌ఎంలను, ఆశా వర్కర్లను ,ఇతర ఆరోగ్య సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని, దీనికి ముఖ్యమంత్రి అనుమతినిచ్చిన విషయాన్ని వెల్లడించారు. ఏ లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయాలనే ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు సక్రమంగా లేవని, అందుకే హైదరాబాద్‌లో వైరస్‌ వ్యాప్తి ఎంత ఉన్నది..? దాని లోతు, మొత్తంగా తెలుసుకునేందుకే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. జిహెచ్‌ఎంసి, రంగారెడ్డి, మేడ్చల్‌, 30 నియోజకవర్గాల్లో కంటైన్‌మెంట్‌ ఏరియాలు, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న తలాబ్‌కట్టా, బాలాపూర్‌, జియాగూడ వంటి ప్రాంతాల్లో 50వేల మందికి ఉచితంగానే వైరస్‌ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. పరిస్థితులను బట్టి పరీక్షల సంఖ్యను పెంచుతామన్నారు. 2వేల బెడ్లను సిద్ధం చేసుకున్నామని, గాంధీ ఆస్పత్రిలో 800 బెడ్లకు ఆక్సిజన్‌తో కూడిన చికిత్సను అందించే వెసులుబాటు ఉన్నదన్నారు. ప్రస్తుతం నాలుగు వందల మంది కంటే ఎక్కువ పేషంట్లు లేరని తెలిపారు. ప్రజలందరూ తప్పకుండా ప్రభుత్వ వసతుతలను వాడుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు 45వేల పైనే కరోనా వైరస్‌ పరీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ముంబయి,అహ్మదాబాద్‌, ఢిల్లీ తరహా మన వద్ద పరిస్థితులు లేవన్నారు. 17వేల బెడ్స్‌ను అందుబాటులో పెట్టామని, 4 నుండి 5 వేల వరకు ఆక్సిజన్‌తో కూడిన బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను, పరీక్ష చేసుకునే వెసులుబాటును కల్పించిందన్నారు. తమ వద్ద ప్రతిరోజూ 4 వేల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్నదని, మరో యంత్రాన్ని కొనుగోలు చేశామని, దీని ద్వారా మరో 3500 పరీక్షలతో కలిపి మొత్తంగా 7500 మందికి పరీక్షలు చేసే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. లాక్‌డౌన్‌ మొదట్లో ఒక న్యూయార్క్‌, ఇటలీ తరహా ఉంటుందని తాము ఉహించామని, కానీ మూడు నెలల కాలంలో చనిపోయిన వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 10వేల మంది దాటలేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?