కరోనా కోరలు!

24 గంటల్లో 872 కొత్త కేసులు
వణికస్తున్న గ్రేటర్‌…ఒక్కరోజే 713 పాజిటివ్‌లు
రంగారెడ్డి జిల్లానూ దడపుట్టిస్తున్న కొవిడ్‌-19
రాష్ట్రంలో మరో ఏడుగురు బలి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కోరలు జాస్తోంది. రికార్డు స్థాయిలో సోమవారంనాడు ఏకంగా 872 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ మహానగరం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒక్కరోజే గ్రేటర్‌ హైదరాబాద్‌లో 713 కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో ఏడుగురు కరోనాకు బలయ్యారు. దీంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 217కి చేరింది. జిహెచ్‌ఎంసి పరిధి మినహాయించి, మిగిలిన రంగారెడ్డి జిల్లాలోనూ ఊహించని రీతిలో కరోనా చెలరేగుతోంది. గత నాలుగు రోజులుగా భారీగా కేసులు వెలుగుచూస్తున్న రంగారెడ్డిలో గడిచిన 24 గంటల్లో మరో 107 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రజలను భయకంపితులను చేస్తున్నది. టెస్టులు పెరిగే కొద్దీ కేసులు పెరుగుతున్నాయి. ఇక మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా 16 కేసులు నమోదు అయ్యాయి. జిల్లా అధికారులు మరింత అప్రమత్తం కావాలని ఆదేశాలు అందాయి. కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నప్పటికీ, జనం విపరీతంగా రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోందని, కేసులు పెరగడానికి ఇదే కారణమని అధికారులు చెపుతున్నారు. జిహెచ్‌ఎంసి కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ కరోనా వ్యాపిస్తోంది. ఆదివారం జనగామను వణికించిన కరోనా ఈసారి మళ్లీ సంగారెడ్డిని భయపెట్టింది. సంగారెడ్డిలో కొత్తగా 12 కేసులు నమోదుకాగా, వరంగల్‌ రూరల్‌లో 6, మంచిర్యాల జిల్లాలో 5 కేసులను గుర్తించారు. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మూడేసి కేసులు నమోదవ్వగా, జనగామ, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో రెండేసి కేసులు పొడసూపాయి. వరంగల్‌ అర్బన్‌లో ఒకే ఒక్క కేసు నమోదయింది. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,674కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 4,452 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,005 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారంనాడు 274 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 3,189 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, అందులో 2,317 శాంపిల్స్‌ నెగిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు మొత్తం 60,243 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

DO YOU LIKE THIS ARTICLE?